ముద్రగడా...! ఇదేం ఎత్తుగడ?

Update: 2016-02-01 11:30 GMT
రైళ్లు నిలిపేసి, రోడ్లు దిగ్బందించేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజ్జర్ల ఆందోళనలోనూ ఇలా కాలేదు.. గుజరాత్ ను గడగడలాడించిన హార్దిక్ పటేల్ కూడా హింసకు దిగలేదు... సభ పేరు చెప్పి పావుగంటలో అగ్గి రాజేసిన కులపోరాటమే ఎక్కడా లేదు. కానీ, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న.... ఆది నుంచి కుల నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం నేతృత్వంలోని కాపు ఉద్యమం మాత్రం హింసాత్మక టర్న్ తీసుకుంది. ఇది ఎత్తుగడల్లో వైఫల్యమా.. నాయకత్వ లోపమా... ముద్రగడను అడ్డుపెట్టుకుని ఇతరులు పన్నిన పన్నాగమా?  

...కారణం ఏదైనా ఉద్యమం ఇలాంటి రూపంలో ఉంటే ఉద్యమ నిలకడ కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న దూకుడు గల పార్టీ టీఆరెస్ కూడా ఎన్నడూ హింసకు దిగలేదు.. అందుకే ఆ ఉద్యమం రోజురోజుకీ బలపడి ఫలితం సాధించగలిగింది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ప్రభుత్వాల బలాల నేపథ్యంలో ప్రత్యక్ష ఉద్యమాల్లో హింసాధోరణులు ఉద్యమ లక్ష్యాన్నే దెబ్బతీస్తాయని ఎన్నోచోట్ల రుజువైంది. తాజాగా కాపు ఉద్యమం కూడా జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటే కానీ మనగలగడం కష్టం.

కాపు గర్జన సందర్భంగా నిన్న తుని పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనకు కారణం నాయకత్వ లోపమేనన్న అభిప్రయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కాపులను బీసీలలో చేర్చాలన్న డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు నిర్మాణాత్మక ఉద్యమాన్ని నిర్మించుకోవాలి... కానీ, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం దుందుడుకుగా వ్యవహరించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటు నిరాటంకంగా, వ్యూహాత్మకంగా నిర్వహించిన కేసీఆర్ విజయం సాధించారు.. అందుకు భిన్నంగా న్యాయపరమైన అంశాలను పట్టించుకోకుండా, వెంటనే బీసీల జాబితాలో కాపులను చేరుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా...ఒక వేళ జీవో జారీ చేసినా అది కోర్టులలో నిలబడుతుందా అన్న అంశాలను పరిగణనలోనికి తీసుకోకుండా కాపు నేతలు వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది.  ముద్రగడ పద్మనాభం రాజకీయాలలోకి పునరాగమనం చేయాలన్న ఉద్దేశంతో కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న రెడీమేడ్ నినాదాన్ని పట్టుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో అనాలోచిత నిర్ణయం తీసుకున్నారనీ, హఠాత్తుగా రోడ్డు రోకో - రైల్ రోకో పిలుపునివ్వడం...ఆందోళనకారులను నియంత్రించే శక్తి ఆయన నాయకత్వానికి లేకపోవడం వల్లనే ఇంతటి హింసాకాండ చోటు చేసుకుందని పరిశీలకులు అంటున్నారు. దీని వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాపు యువత కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి ఇబ్బందులు పడటం తప్ప కోరుకున్న ప్రయోజనం దక్కదన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News