ముద్ర‌గ‌డ డిమాండ్‌ కు ముంద‌డుగు ప‌డింది​

Update: 2016-02-04 23:07 GMT
కాపు పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం నిర‌శ‌న దీక్ష అల్టిమేటంకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం వేగంగా స్పందించింది. రేపటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు - తోట త్రిమూర్తులూ - ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావులు చర్చలు ప్రారంభించారు. కాపులను బీసీలలో చేర్చేందుకు తెలుగుదేశం కట్టుబడి ఉందని వారు ఈ సందర్భంగా ముద్రగడకు వివరించారు. దీక్ష నిర్ణయాన్ని విరమించుకోవలసిందిగా వారీ సందర్భంగా ఆయనను కోరారు.

ఇదిలాఉండ‌గా...ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తన తరపున ఎవరూ వెళ్లలేదని పద్మనాభం తెలిపారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎవరొచ్చి మాట్లాడినా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒకవేళ చర్చల్లో తమ జాతికి న్యాయం జరుగుతుందని అనిపిస్తే నిర్ణయం తీసుకుంటానన్నారు. రిజర్వేషన్ల కోసమే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. తమ జాతికి న్యాయం కోసమే పోరాట చేస్తున్నామని, ఇతరులను బాధపెట్టాలన్న ఉద్దేశం లేదని ముద్రగడ తెలిపారు. 9 గంటల నుంచి తన దీక్ష మొదలవుతుందని ఉద్ఘాటించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజాగా ఈ అడుగు వేసింది.
Tags:    

Similar News