ముద్రగడ బహిరంగ లేఖ టార్గెట్ ఎవరు?

Update: 2016-08-22 10:24 GMT
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతోంది.  తుని ఘటనలో పలువురు కాపులకు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఘాటుగా స్పందించిన ముద్రగడ తన లేఖలో చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించడంతోపాటు ఒక సామాజికవర్గ నేతలను టార్గెట్ చేసినట్లుగా విశ్లేషిస్తున్నారు.  కాపు జాతిపై ద్రోహులన్న ముద్ర వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. తామేమీ బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి తిరుగుతున్న ముద్దాయిలం కాదని పరోక్షంగా పలువురు నేతలకు చురకలు వేశారు.

తామేమీ తీవ్రవాదులం కాదని... రాజధానిలో పరిశ్రమల పేరుతో భూములు కాజేసిన వాళ్లమూ కాదని ముద్రగడ అన్నారు. విచారణకు నోటీసులు పంపితే తీసుకోవాలని అవసరమైతే బేడీలు వేసుకుని జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడాలని కాపులకు ఆయన పిలుపునిచ్చారు. విచారణకు పిలిస్తే వెళ్లే ముందు సమాచారం ఇవ్వాలంటూ ఆయన మూడు నంబర్లు ఇచ్చారు.  అందులో ఒకటి ముద్రగడ ఫోన్ నంబరు కాగా మిగతా రెండు నంబర్లు వేరే నేతలవిగా తెలుస్తోంది.

కాగా బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసినవాళ్లం తాము కాదని ముద్రగడ అనడం పలువురు నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని తెలుస్తోంది.  రాజధానిలో భూములు కాజేసింది కూడా తాము కాదని ముద్రగడ విమర్శించడం వెనుక పెద్ద అర్థమే ఉందంటున్నారు. ఇటీవల బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి - కావూరి సాంబశివరావు వంటివాళ్లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News