ముద్రగడ కోరుకుంటున్న జేఏసీ ఏమిటి..?

Update: 2016-06-13 04:55 GMT
తుని విధ్వంసకాడంకు బాధ్యులైన నిందితుల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేయటాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాపునేత ముద్రగడ పద్మనాభం ఆమరణనిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో ఉన్న ఆయన వైద్యులు ఎంత కోరుతున్నా చికిత్సకు అంగీకరించటం లేదు. గడిచిన ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడకు వెనువెంటనే రక్త పరీక్షలు జరిపితే తప్పించి.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై అవగాహనకు రావటం కష్టమన్న మాటను వైద్యులు చెబుతున్నారు.

ప్రతి రెండు గంటలకు ఒకసారి వెళ్లి ముద్రగడను వైద్యులు కలుస్తున్నా.. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించటానికి.. వైద్యం చేయటానికి ససేమిరా అంటున్నారు. నాలుగు రోజులుగా నీళ్లు కూడా తాగని కారణంగా ఆయన నీరసించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఆరోగ్యం దెబ్బ తింటే పిలుస్తానంటూ వైద్యులకు తేల్చి చెప్పటంతో వారేమీ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ముద్రగడ ఇష్యూను కొలిక్కి తెచ్చేందుకు ఏం చేయాలన్న కోణంలో జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముద్రగడను కలిసిన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆయనతో చర్చలు జరిపారు.

తాను సూచించిన కాపు ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి.. వారి పక్షంలో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపేందుకు ముద్రగడ సిద్ధంగా ఉన్నారు. మరి.. ఈ విషయంలో ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముద్రగడ సూచించిన నేతలతో ఐకాసను ఏర్పాటు చేసి.. ముద్రగడ డిమాండ్ల మీద చర్చించి తగు నిర్ణయం తీసుకుంటే తప్పించి ముద్రగడ ఎపిసోడ్ ప్రశాంతంగా ముగిసేటట్లుగా కనిపించట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News