అంతా సెట్‌ చేసేశామంటున్న ముద్ర‌గ‌డ‌

Update: 2018-01-24 06:48 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కాపు రిజర్వేషన్‌ పోరాట ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న పెట్టారు. త‌మ కీల‌క డిమాండ్ అయిన రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప్ర‌తిపాద‌న చేస్తూ...ఈ విష‌యంలో కీల‌క వ్య‌తిరేక‌త‌ను స‌రిదిద్దామ‌ని ఇక చంద్ర‌బాబు త‌గు నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆల‌స్య‌మ‌న్నారు. కాపులను బీసీ-ఎఫ్‌ గ్రూప్‌ గా గుర్తిస్తూ సర్టిఫికెట్లు విడుదల చేసినప్పుడే తమకు రిజర్వేషన్లు అమలైనట్లుగా భావిస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తారని విశ్వసిస్తున్నామని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చెప్పారు. కాపు రిజర్వేషన్లపై గవర్నర్‌ సంతకం అయినందున బిల్లుకు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ `ఓబీసీ` రిజర్వేషన్ల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాల్సి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లలో ఎఫ్‌ గ్రూప్‌ గా కాపులను గుర్తించి వర్గీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని బీసీ నాయకులు స్పష్టత ఇచ్చారని ఆయన తెలిపారు. ఇక విధానప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే ఆల‌స్య‌మ‌న్నారు. రాజకీయ రిజర్వేషన్లపై కూడా తమ డిమాండ్‌ ను ప్రభుత్వం ఎదుట పెడుతున్నామని చెప్పారు.

గుజరాత్‌ లో పటేళ్ల రిజర్వేషన్ల పోరాటం అనంతరం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న అభిప్రాయం వ్యక్తమైన అంశాన్ని విలేకర్లు లేవనెత్తగా తమిళనాడు - కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని ముద్ర‌గ‌డ‌ గుర్తు చేశారు. ప్రభుత్వం తొలివిడతగా 700 పోస్టులు - రెండోవిడత మరో 700 పోస్టులను విడుదల చేయటమేకాక త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనుందని, పోలీసు శాఖలో కూడా వేలాది ఉద్యోగాలు ఉన్నాయని - ఉద్యోగావకాశాలు అన్నీ పూర్తయ్యాక కాపులకు రిజర్వేషన్ ఇచ్చి ఏం ఉపయోగమని ప్రశ్నించారు. కాపు జాతికి అన్యాయం చేయవద్దని - ఆకలి తీర్చమని అడుగుతున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ ప్రకటించి కాపు యువతను శాంతింప చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సీఎం నాలుగేళ్లయినప్పటికీ ప్రకటించలేదని - దీనివల్ల తమ జాతి ఉపాధి అవకాశాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్ వస్తుందనే నమ్మకం తమ జాతికి ఉందన్నారు. బీసీ కులాలకు ఎలాంటి రిజర్వేషన్ వర్తింప చేస్తున్నారో అలాగే తమకు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News