ఖాన్ గారి అబ్బాయికి అంత సపోర్టు చేసే ముఫ్తీ.. పండిట్లను చంపేస్తుంటే మాట్లాడరేం?

Update: 2021-10-12 09:05 GMT
ఈ దేశంలో ప్రజాసేవలో ఉండి.. ప్రజల కోసం తపిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే వారి మాటలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. నిజానికి ఇలాంటి వారి మాటలు విన్నప్పుడు.. ఈ దేశానికి పట్టిన దరిద్రాలకు కారణాలు ఏమిటన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. జమ్ముకశ్మీర్ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత.. మతాలకు అతీతంగా మాట్లాడాలన్న కనీస ఇంగితం లేకపోవటాన్ని ఏమనాలి? ఏలా చూడాలి. రాగ ద్వేషాలకు అతీతంగా అందరిని ఒకేలా చూస్తానని ప్రమాణం చేసి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మాత్రమే కాదు.. ఆ పదవి పోయిన తర్వాత కూడా ఆ స్థాయి వ్యక్తుల ఆలోచనలు ఉన్నతంతా ఉండాలే కానీ.. మతానికి పరిమితం కాకూడదు.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తో దొరికిపోయినట్లుగా వార్తలు రావటం.. ప్రస్తుతం జైల్లో ఉండటం.. వరుస పెట్టి చేస్తున్నబెయిల్ ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించకపోవటం తెలిసిందే. ఇలాంటివేళ.. షారుక్ కొడుకును జైల్లో పెట్టటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ముఫ్తీ తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఆమె మాటల్లో పేరు చివర ఉన్న ‘ఖాన్’ చుట్టూ తిరగటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎక్కడో ముంబయిలో ఉండే ఆర్యన్ ఖాన్.. ఆరేబియా సముద్రంలోని ఒక విలాసవంతమైన క్రూయిజ్ లో డ్రగ్స్ తో దొరికి.. జైలు పాలు అయిన వైనంపై స్పందించిన మొహబూబా ముఫ్తీ తీరును తప్పు పడుతున్నారు.

తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టిన రాష్ట్రంలో.. తీవ్రవాదులు పలువురు జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపుతున్న వైనాలు అంతకంతకూఎక్కువ అవుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఇలాంటి ఉదంతాలు పలు చోటు చేసుకున్నాయి. దీంతో భయాందోళనకు చెందిన పలువురు కశ్మీరీ పండిట్లు తమ సొంత నేలను వదిలిపెట్టి భయంతో రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. ఇలాంటి అంశాల మీద ముఫ్తీ ఎందుకు మాట్లాడరు? సొంత రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తుంటే పట్టని మొహబూబా ముఫ్తీ.. అక్కడెక్కడో ఉండి.. డ్రగ్స్ కేసులో దొరికిన షారుక్ కొడుకు గురించి ఆవేదన వ్యక్తం చేయటమా? ఇదేం నీతి? దీని మీద ఏ లౌకికవాది నోరు విప్పరేం?





Tags:    

Similar News