దీపావళి వేళ 'మూరత్ ట్రేడింగ్'.. ఈసారి ఎలా సాగింది?

Update: 2022-10-25 04:19 GMT
ఏడాది మొత్తం ఒక లెక్క.. దీపావళి ఒక్కరోజు మరో లెక్క. సాధారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉదయం మొదలై సాయంత్రానికి కాస్తంత ముందుగా క్లోజ్ కావటం తెలిసిందే. ఏడాదిలో మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. దీపావళి ఒక్కరోజు మాత్రం.. సాయంత్రం 6-15 గంటల నుంచి 7-15 గంటల మధ్యలో ఒక్క గంట పాటు నిర్వహిస్తారు. దీన్ని మూరత్ ట్రేడింగ్ గా వ్యవహరిస్తారు.

పండుగ పూట ప్రత్యేకంగా నిర్వహించే ఈ ట్రేడింగ్ వేళ.. కనీసం ఒక్క షేరు అయినా కొనుగోలు చేస్తే.. ఆ ఏడాది అంతా బాగుంటుందన్నది ఒక నమ్మకం.

దీపావళి వేళ.. సాయంత్రం వేళలో నిర్వహించే లక్ష్మీ పూజ వేళలోనే ఈ ప్రత్యేక ట్రేడింగ్ ఉంటుంది. ప్రతి ఏడాది దీపావళి పర్వదినాన.. ప్రత్యేకంగా సాయంత్రం ఒక గంట పాటు మూరత్ ట్రేడింగ్ ను నిర్వహిస్తారు.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారిలో చాలామంది ఈ మూరత్ ట్రేడింగ్ లో ఒక్క షేరైనా కొనుగోలు చేయాలని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మూరత్ ట్రేడింగ్ ప్రారంభంతో కొత్త హిందూ సంవత్సరం మొదలైనట్లుగా పలువురి నమ్మకం.

ఈ కారణంతోనే దీపావళి పర్వదినాన స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించనప్పటికీ.. సాయంత్రం వేళలో ఒక్క గంట పాటు ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహిస్తారు. సరిగ్గా 6-15 గంటలకు మొదలయ్యే ఈ ట్రేడింగ్ ఏడుంబావుకు ముగుస్తుంది. మరి.. ఈ దీపావళి సందర్భంగా నిర్వహించిన మూరత్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ కు లాభాల పంటను తీసుకొచ్చింది. సెంటిమెంట్ కు తగ్గట్లే మార్కెట్ దూసుకెళ్లింది.

ఈ దీపావళి ప్రత్యేక ట్రేడింగ్ ను బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రారంభించారు. దీపావళి సందర్భంగా సోమవారం సాయంత్రం ఆరుంబావుకి గంట కొట్టి ట్రేడింగ్ ను షురూ చేశారు. ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 524.51 పాయింట్లు లాభపడి 59,831.66 వద్ద ముగియగా.. ఎన్ఎస్ఈలో నిఫ్టీ 162.15 పాయింట్లతో 17,738.45 వద్ద స్థిరపడింది. పలు స్టాకులు లాభాల్లో పయనించాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News