ఆలీబాబాను క్రాస్ చేసిన అంబానీ!

Update: 2018-12-25 05:10 GMT
దేశంలో కుబేరులు అన్న వెంట‌నే టాటా.. బిర్లాల పేర్లు వినిపించేది. అది ఒక‌ప్పుడు. అంబానీ ఎంట్రీతో ఆ రికార్డు తెర‌మ‌రుగు ప‌డింది. ఇండియాలోనే కాదు.. ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ఇప్ప‌టికే చోటు ద‌క్కించుకున్న రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మ‌రో రికార్డున సాధించారు.

ఆసియాలోనే అత్యంత సంప‌న్నుల జాబితాలో ఆయ‌న చేరారు. ఈసారి రికార్డు ఏమంటే.. చైనా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఆలీబాబాను ఆయ‌న క్రాస్ చేశారు. దీంతో.. ఆసియా ఖండంలోనే అత్యంత సంప‌న్నుడిగా ముకేశ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆసియా ఖండంలోని వివిధ దేశాల‌కు చెందిన సంప‌న్నుల సంప‌ద క‌రిగిపోతున్నా.. అంబానీ ఆస్తుల విలువ మాత్రం అంత‌కంత‌కూ పెరిగిపోతుండ‌ట‌మే.

అయితే.. ఇదంతా ఎలా సాధ్య‌మైందంటే.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్లు పెడుతున్న ప‌రుగుల‌తో ఇప్పుడు ఆయ‌న ఆస్థి విలువ సుమారు 43.2 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉన్నట్లు లెక్క‌లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఆలీబాబా ఆస్తులు కేవ‌లం 35 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే. బ్లూమ్ బ‌ర్గ్ బిలియ‌నీర్స్ సూచీ నివేదిక ప్రకారం 2018లో ఆసియాలో 128 మంది కుబేరుల సంప‌ద 137 బిలియ‌న్ డాల‌ర్ల మేర త‌గ్గిపోతే.. వీరికి మిన‌హాయింపుగా ముకేశ్ అంబానీ ఆస్తులు మాత్రం అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. దీనికి కార‌ణం స్టాక్ మార్కెట్లో ఎన్ని ఒడిదిడుకులు చోటు చేసుకున్నా.. ముకేశ్ రిల‌య‌న్స్ షేరు మాత్రం పెర‌గ‌ట‌మే కానీ త‌గ్గ‌క‌పోవ‌టం కూడా ఆయ‌న ఆసియాలోనే అత్యంత సంప‌న్నుడి హోదాను క‌ట్ట‌బెట్టిన‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News