11వ‌సారీ అంబానీయే!!

Update: 2018-10-05 07:38 GMT
ఏళ్లు గ‌డుస్తున్నాయ్‌. వ్యాపార ధోర‌ణులు మారుతున్నాయ్‌. కొన్ని వ్యాపారాల కుదేల‌వుతున్నాయ్‌. మ‌రికొన్ని కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయ్‌. ఎంద‌రో పారిశ్రామికవేత్త‌లు పుట్టుకొస్తున్నారు. మ‌రెంద‌రో న‌ష్టాల్లో మునిగిపోతున్నారు.

కానీ.. ఒక్క‌డు మాత్రం మార‌ట్లేదు. భార‌త్‌ లో అప‌ర కుబేరుడిగా త‌న‌కున్న పేరును ఏళ్లుగా నిల‌బెట్టుకుంటున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పంథాలు అనుస‌రిస్తూ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని మ‌రింత విస్త‌రిస్తున్నాడు. అత‌డే.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ.

ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్‌ మేగజైన్‌ 2018 సంవత్సరానికి 100 మంది సంపన్న భారతీయులతో ఓ జాబితాను తాజాగా రూపొందించింది. ఇందులో ముకేశ్ అంబానీ అగ్ర‌స్థానంలో నిలిచారు. ఆయ‌న సంప‌ద విలువ 4,730 కోట్ల డాల‌ర్లు. అంటే సుమారు రూ.3.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు. భార‌త్‌ లో అత్యంత సంప‌న్న వ్య‌క్తిగా ముకేశ్ నిల‌వ‌డం వ‌రుస‌గా 11వసారి కావ‌డం విశేషం. రిలయన్స్‌ జియో బ్రాడ్‌ బ్యాండ్‌ విజయంతో ముకేశ్‌ సంపద ఏడాదిలో ఏకంగా రూ.67 వేల కోట్లు పెరిగిన‌ట్లు ఫోర్బ్స్ మేగ‌జైన్‌ వెల్ల‌డించింది.

ఇక ముకేశ్ త‌ర్వాతి స్థానంలో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌ జీ నిలిచారు. ఆయ‌న సంప‌ద రూ.1.51 లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న ప్రేమ్‌ జీతో పోలిస్తే.. ముకేశ్ సంప‌ద విలువ రెట్టింపు కంటే ఎక్కువ కావ‌డం విశేషం. భార‌త అప‌ర కుబేరుల జాబితాలో ల‌క్ష్మీనివాస్ మిట్ట‌ల్ రూ.1.31 లక్షల కోట్ల సంప‌ద‌తో మూడో స్థానంలో - హిందూజా సోద‌రులు రూ.1.30 లక్షల కోట్ల సంప‌ద‌తో నాలుగో స్థానంలో - షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ అధినేత పల్లోంజీ మిస్త్రీ రూ.1.13 లక్షల కోట్ల సంప‌ద‌తో ఐదో స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్‌ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ దిగ్గ‌జ సంస్థ‌ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) చైర్మన్‌ పిపి రెడ్డి తొలిసారిగా ఈ జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న సంప‌ద విలువ రూ.22,300 కోట్లు. ఫోర్బ్స్ జాబితాలో ఆయ‌న 47వ స్థానంలో నిలిచారు. అరబిందో ఫార్మా చైర్మన్‌ పివి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి - దివీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ మురళి దివీ - డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కుటుంబం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించారు.
Tags:    

Similar News