బాబు ప్రాజెక్టు చూడాల‌ని మోడీకి రాష్ట్రప‌తి చెప్పారా?

Update: 2018-02-14 08:36 GMT
దేశంలో అత్యంత ప్రముఖుల్లో మొద‌టి  ఇద్ద‌రు ఎవ‌రన్న ప్ర‌శ్న వేస్తే చాలామంది స‌మాధానం చెప్పేయొచ్చు. ఆ స‌మాధానం రాష్ట్రప‌తి కోవింద్‌.. ప్ర‌ధాని మోడీ అని చెప్పేస్తారు. మ‌రి.. ఈ ఇద్ద‌రు క‌లిసినప్పుడు మాట్లాడుకుంటుంటే వినే ఛాన్స్ ఎవ‌రికైనా ఉంటుందా? అన్న ప్ర‌శ్న వేస్తే.. నో అనేయ‌టం ఖాయం. కాదు.. కాస్త ఆలోచించ‌మ‌ని చెబితే.. చాలానే పేర్లు చెప్పొచ్చు. కానీ.. ఎవ‌రూ కూడా రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ అని చెప్పే అవ‌కాశం ఉండ‌దు.

ఎవ‌రూ ఊహించ‌ని కాంబినేష‌న్లో జ‌రిగిన ఒక అంశాన్ని బ‌య‌ట‌పెట్టారు ముకేశ్ అంబానీ. అయితే.. ఈ ఎపిసోడ్‌ లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రాష్ట్రప‌తి.. ప్ర‌ధాని క‌లిసిన‌ప్పుడు వారి మాట‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌స్తావన వ‌చ్చింద‌ట‌.  తాను ఏపీకి వెళ్లిన స‌మ‌యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌కు ఏపీ రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సెంట‌ర్ చూపించార‌ని.. ఆ కేంద్రాన్ని ప‌రిశీలించాల‌ని మోడీకి రాష్ట్రప‌తి చెప్పిన‌ట్లుగా చెప్పారు.

ప్ర‌ధానితో రాష్ట్రప‌తి చెప్పిన మాట‌ను తాను విన్నాన‌ని.. అదేంటో చూడాల‌ని తాను అనుకున్న‌ట్లు చెప్పారు.  ఏపీలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఆర్డీజీ సెంట‌ర్ ను చూసి.. అద్భుతంగా అభివ‌ర్ణించారు. త‌న‌కు తెలిసి ఇలాంటి సెంట‌ర్ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేద‌ని ముకేశ్ వ్యాఖ్యానించారు.

సుప‌రిపాల‌న రంగంలో ప్ర‌పంచంలో అతి చిన్న దేశ‌మైన ఎస్టోనియా అంద‌రికి అద‌ర్శ‌మ‌నీ తాను ఇన్నాళ్లు అనుకున్నాన‌ని.. కానీ ఏపీ చేస్తున్న సాంకేతిక సుప‌రిపాల‌న చూస్తుంటే.. ఏపీలో నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌నిపిస్తోంద‌న్నారు. ఎస్టోనియా బృందం రిల‌య‌న్స్ లో ప‌రిశోధ‌న  చేస్తోంద‌ని.. త‌న బృందాన్నిఏపీలోని ఆర్డీజీకి పంప‌నున్న‌ట్లు చెప్పారు. బాబు లాంటి స‌మ‌ర్థుడు మ‌రింత పెద్ద హోదాలో ఉంటే అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. అంబానీ లాంటోడికి చంద్ర‌బాబు మ‌రింత పెద్ద హోదాలో ఉంటే బాగుంటుంద‌న‌టంలో అర్థ‌మేంది?  బాబును ముకేశ్ ఏ స్థానంలో ఉండాల‌ని కోరుకుంటున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News