దుమ్మురేపుతున్న రిల‌య‌న్స్‌: అనూహ్యంగా పెరుగుతున్న సంప‌ద‌

Update: 2020-07-06 13:30 GMT
ప్ర‌స్తుత విప‌త్క‌ర స‌మ‌యంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు ఆర్జిస్తూ అన్ని రంగాల్లోనూ దుమ్మురేపుతోంది. ఇప్ప‌టికే రుణ ర‌హిత సంస్థ‌గా ఆవిర్భ‌వించిన రిల‌య‌న్స్ ఇప్పుడు తాజాగా మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ రూ.11.5 లక్షల కోట్ల మార్క్ దాటిపోయి సంచ‌ల‌నం సృష్టించింది. స్టాక్ మార్కెట్‌లోనూ అగ్ర‌భాగాన రిల‌య‌న్స్ నిలుస్తోంది. తాజాగా సోమ‌వారం ఈ సంస్థ షేర్ ధర మధ్యాహ్నం 2.17 గంట‌ల సమయానికి 3.37 శాతం పెరిగి రూ.1,848.10కి చేరుకుంది. అంతకుముందు 2.5 శాతం పెరిగి రూ.1,833 చేరుకుని రికార్డ్ మార్క్‌ను దాటేసింది. రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వరుస పెట్టుబడుల నేపథ్యంలో ఈ కంపెనీ ఎం-క్యాప్ దూసుకెళ్లింది.

ఈ కంపెనీ షేర్ ధర 3.50 శాతం పెరిగి రూ.1,850 చేరుకున్న సమయానికి అప్పటికే రూ.11.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటింది. ఏప్రిల్ 22వ తేదీన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ జియో ప్లాట్‌ఫాంలో రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టి 9.99 శాతం వాటా దక్కించుకున్న రోజు ఎం-క్యాప్ రూ.7.83 లక్షల కోట్లుగా ఉంది. అది 11 వారాల్లో ఎం-క్యాప్ రూ.3.7 లక్షల కోట్లు పెరిగి మరో రికార్డును నమోదు చేసింది.

2021 మార్చి 31వ తేదీకి త‌మ కంపెనీని రుణరహిత సంస్థగా తీర్చిదిద్దుతామని ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించ‌గా దాదాపు ప‌ది నెలల ముందే ల‌క్ష్యం పూర్తి చేశారు. ఇక రిలయన్స్ ద‌శ తిరిగింది. ఆ కంపెనీ షేర్లకు రెక్కలు వచ్చాయి. ప్ర‌స్తుత విప‌త్క‌ర సమయంలో వృద్ధి చెందిన భారతీయ సంస్థల్లో రిలయన్స్ మొద‌టి స్థానంలో ఉంది. లిస్టయిన కంపెనీల్లో నష్టపోవడం లేదా అతి స్వల్పంగా లాభపడుతున్నాయి. కానీ రిలయన్స్ మాత్రం భారీగా లాభాలు పొందుతోంది.

జియో ప్లాట్‌ఫాంలోకి ఫేస్‌బుక్ మొదలు ఇంటెక్ వరకు వివిధ అంతర్జాతీయ సంస్థలు 12 పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి రైట్స్ ఇష్యూ అండ‌గా నిలిచింది. దీంతో కంపెనీ 58 రోజుల్లో రూ.1.68 లక్షల కోట్లకు పైగా సమీకరించి రుణరహిత సంస్థ‌గా ఆవిర్భ‌వించింది. లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ రూపొందించిన టాప్ 100 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. 89వ స్థానం సంపాదించింది. మహమ్మారి సమయంలో భారీగా ఎదిగిన కంపెనీల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది.

ఇదే ట్రెండ్ కొన‌సాగితే రిలయన్స్ షేర్ ధర రూ.2,000కు చేరుకుంటుంద‌ని, ఈ ఏడాది చివరి నాటికి అది న‌మోద‌వుతుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రూ.12 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకోచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా ముఖేశ్ అంబానీ వ్యాపారంలో స‌త్తా చాటుతూ భార‌త‌దేశంలోనే అతి సంప‌న్నుడుగా సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నాడు.
Tags:    

Similar News