ముకేశ్ ఆస్తి మొత్తాన్ని దేశానికి విరాళం ఇచ్చేస్తే..?

Update: 2018-02-14 05:16 GMT
దేశం మొత్తంలో అత్యంత ధ‌న‌వంతుడిగా ఇప్ప‌టికే గుర్తింపు పొందిన ముకేశ్ అంబానీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశ‌మిది. ముకేశ్ ఆస్తి మొత్తాన్ని దేశానికి విరాళంగా ఇచ్చేస్తే?  ప్రాక్టిక‌ల్ గా ఏ మాత్రం వర్క్ అవుట్ కాని ఈ లెక్క ఎందుకొచ్చిందంటే.. దీనికో కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులు త‌మ ఆస్తుల్ని ఆయా దేశ ప్ర‌భుత్వాల‌కు విరాళం ఇచ్చేస్తే.. ఆయా దేశాలు ఎన్ని రోజుల పాటు న‌డిచే అవ‌కాశం ఉంద‌న్న ఆస‌క్తిక‌ర లెక్క‌ను బ్లూమ్ బ‌ర్గ్ వేసింది.

ఇందులో భాగంగా 49 దేశాల‌కు సంబంధించిన రాజ‌కీయ ప‌రిస్థితులు.. ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు చేసే విధానాల్ని.. ఆయా దేశాల సంప‌న్నుల సంప‌ద‌ను లెక్క‌లోకి తీసుకుంది. 2017 డిసెంబ‌రు నాటికి ఆయా దేశాల్లోని అత్యంత ధ‌నికుల సంప‌ద‌ను ప్ర‌భుత్వానికి విరాళ‌మిస్తే.. ఒక్కో ధ‌న‌వంతుడు ఇచ్చిన సంప‌ద‌తో ఆయా దేశాలు ఎన్ని రోజులు బండి న‌డ‌ప‌వ‌చ్చ‌న్న లెక్క‌లోకి 49 మంది సంప‌న్నుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఈ 49 మందిలో న‌లుగురు మ‌హిళలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాబిన్ హుడ్ ఇండెక్స్ పేరుతో రూపొందించిన ఈ నివేదిక‌లో సంప‌న్నుల సంప‌ద‌ను న‌గ‌దుగా మార్చేసి.. దాన్ని ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌కు వినియోగించే వైనాన్ని లెక్క క‌ట్టారు. వారి సంప‌ద‌ను విరాళంగా మార్చేసి.. దేశంలోని సంస్థ‌ల‌కు పంచేస్తే.. దాంతో ప్ర‌భుత్వం ఎన్ని రోజులు న‌డ‌ప‌గ‌ల‌ర‌న్న లెక్కను చూస్తే.. మ‌న ముకేశ్ అంబానీ ఆస్తితో దేశాన్ని 20 రోజుల పాటు న‌డిపేయొచ్చ‌ని తేల్చారు.

అదే స‌మ‌యంలో సైప్ర‌స్ సంప‌న్నుడు జాన్ ఫ్రెడ‌రిక్ స‌న్ త‌న సంప‌ద మొత్తాన్ని ప్ర‌భుత్వానికి ఇచ్చేస్తే 441 రోజుల పాటు ఆ దేశ ప్ర‌భుత్వాన్ని న‌డిపేయొచ్చ‌ని లెక్క క‌ట్టారు. చైనా సంప‌న్నుడు జాక్ మా ఆస్తితో ఆ దేశాన్ని నాలుగు రోజుల పాటు న‌డ‌ప‌గ‌ల‌రు. అమెరికాకు చెందిన జె బిజోస్ ఆస్తితో అమెరికాను ఐదు రోజుల పాటు.. స్పెయిన్ సంప‌న్నుడు అమాన్సియో ఒర్టెగా సంప‌ద‌తో 48 రోజులు.. ఫ్రాన్స్ సంప‌న్నుడు బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆస్తితో 15 రోజులు.. మెక్సికో సంప‌న్నుడు కార్లోస్ స్లిమ్ ఆస్తితో 82 రోజులు.. హాంకాంగ్ కుబేరుడు లీ-కా షింగ్ సంప‌ద‌తో 191 రోజులు ఆయా దేశాల ప్ర‌భుత్వాల్ని న‌డిపే వీలుంద‌ని తేల్చారు. ఆచ‌ర‌ణ సాధ్యం కాకున్నా.. ఈ లెక్క అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News