కొడుకు కోసం మాజీ మంత్రి ప్లాన్ ఫ‌లించేనా...!

Update: 2019-07-07 11:16 GMT
కాంగ్రెస్ పార్టీలో ముఖేష్‌ గౌడ్ అంటే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ అంటే ముఖేష్‌ గౌడ్‌.. కానీ.. ఇది ఒక‌ప్ప‌టి ముచ్చ‌ట‌. ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవు. అయితే.. ప్ర‌స్తుతం త‌న కుటుంబానికి రాజ‌కీయంగా పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు ముఖేష్‌ గౌడ్ ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లుపెట్టార‌ట‌. ఇందుకోసం ప్లాన్-ఏ - ప్లాన్‌-బీ కూడా ఆయ‌న రెడీ చేసుకున్నార‌ట‌. ప్లాన్‌-ఏలో కాంగ్రెస్ పార్టీ గ్రేట‌ర్ అధ్య‌క్ష ప‌ద‌విని త‌న కుమారుడు విక్ర‌మ్‌ గౌడ్‌ కు అప్ప‌గించేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేయ‌డం - మేయ‌ర్ అభ్య‌ర్థిగా విక్ర‌మ్‌ ను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేయ‌డం. మొద‌ట ఈ రెండు అంశాల ఎజెండాగా ఆయ‌న మ‌ళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నిజానికి.. ముఖేష్‌ గౌడ్‌ కు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లో మంచి ప‌ట్టుంది. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న కుటుంబం ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీతోపాటు ఆయ‌న కూడా రాజ‌కీయంగా ప‌ట్టుకోల్పోయారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతూ వ‌స్తున్నారు.

ఇన ఆయ‌న కుమారుడు గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఓట‌మిపాల‌య్యారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో ముఖేష్‌ గౌడ్ గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో గ్రేట‌ర్‌పై ప‌ట్టుకోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. పార్టీ గ్రేట‌ర్ అధ్య‌క్ష‌ ప‌ద‌వి తన కుమారుడు విక్ర‌మ్‌ గౌడ్‌ కు ఇవ్వాల‌నే డిమాండ్‌ ను పార్టీ అధిష్ఠానం ముందుకు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రేట‌ర్ ప్ర‌జ‌లు అండ‌గా నిలిచారు. ఇక ఇదే స‌మ‌యంలో పార్టీలో కూడా ప్ర‌క్షాళ‌న దాదాపుగా మొద‌లైన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యంలో పార్టీలో యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పిస్తే.. పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని - గ్రేట‌ర్ అధ్య‌క్ష ప‌ద‌వి విక్ర‌మ్‌ గౌడ్‌ కు ఇస్తే.. త‌మ సామాజివ‌ర్గం నుంచి పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని ముఖేష్‌ గౌడ్ చెబుతున్నార‌ట‌. ఇక ప్లాన్‌-బీ ఏమిటంటే.. ఆయ‌న డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌ని యెడ‌ల‌.. బీజేపీలోకి వెళ్ల‌డం. ఇప్ప‌టికే.. ముఖేష్ క‌ద‌లిక‌ల‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ పెద్ద‌లు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News