బ్రేకింగ్: ముఖేశ్ గౌడ్ కొడుకు మీద కాల్పులు

Update: 2017-07-28 03:34 GMT
హైదరాబాద్ మహానగరంలో మరో సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ మీద కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున అతడి నివాసంలోనే కాల్పులు చోటు చేసుకోవటం గమనార్హం.

రెండు తూటాలు విక్రం గౌడ్ శరీరంలోకి దూసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో.. బాధితుడ్ని జుబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. హైదరాబాద్  నగరంలో ఒకప్పుడు తిరుగులేని నేతగా పేరున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడుకు మీద.. ఆయన ఇంట్లోనే కాల్పులు చోటు చేసుకోవటం పెను సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం.. గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత‌.. సుమారు రెండున్న‌ర గంట‌ల ప్రాంతంలో విక్రం గౌడ్ ఇంటికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తెల్ల‌వారుజామున మూడు గంట‌ల వేళ‌లో బ్ర‌హ్మ‌ముహుర్తంలో గుడికి వెళ‌దామ‌ని భార్య‌తో చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. గుడికి వెళ్లేందుకు త‌యారైన విక్రం గౌడ్ ఇంటి కింద‌కు వెళ్లే స‌రికి ఏదో శ‌బ్ధంవ‌చ్చింద‌ని.. దాంతో తాను కింద‌కు వ‌చ్చాన‌ని.. అప్ప‌టికే విక్రం గౌడ్ ర‌క్తం మ‌డుగులో ఉన్న‌ట్లుగా అత‌డి భార్య షిపాలి చెబుతున్నారు.

దీంతో.. తాను వెంట‌నే అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లుగా ఆమె చెబుతున్నారు. కాల్పుల్లో విక్ర‌మ్ గౌడ్ చేతిలోకి ఒక బుల్లెట్‌ కుడి చేతికి.. రెండోది ఎడం చేతికి.. మూడోది పొట్ట‌లోకి దూసుకెళ్లాయి. విక్రమ్ గౌడ్ శ‌రీరంలో నుంచి  రెండు బుల్లెట్ల‌ను వైద్యులు వెలికి తీశారు. కుడి చేతిలోకి వెళ్లిన బుల్లెట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.  ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు. పోలీసులు అవుటాప్ డేంజ‌ర్ అని చెప్పార‌న్నారు. ఇక.. కాల్పులు జ‌రిపిన దుండ‌గుడు పారిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

దాడి ఎలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని బాధితుడు విక్ర‌మ్ చెప్ప‌లేక‌పోతున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కుటుంబ క‌ల‌హాలే కాల్పుల‌కు కార‌ణ‌మై ఉండొచ్చ‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. త‌మ కుటుంబంలో ఎవ‌రికీ క‌ల‌హాలు లేవ‌ని విక్ర‌మ్ బాబాయ్ మ‌ధుగౌడ్ చెబుతున్నారు. కాల్పుల‌కు కార‌ణం ఎవ‌రో తెలీదంటున్నారు. మ‌రోవైపు పోలీసుల వాద‌న మ‌రోలా ఉంది. కాల్పుల స‌మాచారంతో విక్ర‌మ్ గౌడ్ ఇంటికి వెళ్లామ‌ని.. ఇంట్లోకి ఎవ‌రైనా వ‌చ్చిన‌ట్లు ఆన‌వాళ్లు క‌న్పించ‌లేద‌న్నారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కోణంలోనూ ద‌ర్యాప్తు సాగుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం ఆధారాలు సేక‌రిస్తున్నామ‌ని.. విక్ర‌మ్ గౌడ్‌కు వెపన్ లైసెన్స్ ఉందా? లేదా? అన్న స‌మాచారాన్ని చెక్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News