గులాబీ గూటికి..మ‌రో టీ కాంగ్ సీనియ‌ర్ నేత‌

Update: 2017-12-14 09:46 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ కు ఇప్పుడు ప‌రిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవ‌నే చెప్పాలి. జాతీయ స్థాయిలో ఆటుపోట్ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆ పార్టీకి తెలుగు నాట కూడా రోజుకో దెబ్బ త‌ప్ప‌డం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీకి ప‌రిస్థితులు ఎలా ఉన్నా.... తెలంగాణ ప్ర‌జ‌ల 60 ఏళ్ల క‌ల‌ను సాకారం చేసిన పార్టీగా తెలంగాణ‌లో ఆ పార్టీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టాల్సిందే. అయితే టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు అమ‌లు చేసిన వ్యూహంతో తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించిన పార్టీగా గుర్తింపు ఉన్నా... కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి దెబ్బ త‌ప్ప‌లేదు. స‌రే.. ఆ దెబ్బ త‌గిలి నాలుగేళ్లు కావ‌స్తోంది. మ‌రో ఏడాదిలో మ‌రోమారు ఎన్నిక‌లు ఉన్నాయి. క‌నీసం ఈ ఎన్నిక‌ల్లోనైనా పూర్వ వైభవం చాటుదామంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

అయితే ఐక్య‌త లేని స‌ద‌రు వ్యూహాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... కొత్త‌గా ఇప్పుడు ఆ పార్టీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. పార్టీలో సీనియ‌ర్ నేత‌గానే కాకుండా హైద‌రాబాదు న‌గ‌రంలోకిని పాత‌బ‌స్తీలో మంచి ప‌ట్టున్న నేత‌గా పేరున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ఇప్పుడు హ‌స్తం పార్టీకి చేయిచ్చేస్తున్నారు. పాత‌బ‌స్తీలోని గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేశ్... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డితో పాటు మాజీ సీఎంలు రోశ‌య్య‌ - కిర‌ణ్ కుమార్ రెడ్డిల మంత్రివ‌ర్గాల్లో సీనియ‌ర్ మంత్రిగా ప‌నిచేశారు. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ వైపు వీచిన గాలిలో ముఖేశ్... బీజేపీ అభ్య‌ర్థి చేతిలో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత కొంత కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గానే ఉన్నా ముఖేశ్... ఇటీవ‌ల త‌న కుమారుడు చేసిన నిర్వాకం వ‌ల్ల దాదాపుగా ఇల్లు దాటి బ‌య‌టకు రావ‌డం లేదు.

ఈ క్ర‌మంలో పార్టీ మార్పున‌కు సంబంధించిన దిశ‌గా చూసిన ముఖేశ్ ఎట్ట‌కేల‌కు కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ తెచ్చుకోగ‌లిగార‌ట‌. ముఖేశ్ ను పార్టీలో చేర్చుకునేందుకు తొలుత కేసీఆర్ సానుకూలంగా స్పందించ‌లేద‌ని స‌మాచారం. అయితే పాత‌బ‌స్తీకి చెందిన ఓ కీల‌క నేత చ‌క్రం తిప్పి.. ముఖేశ్ త‌ర‌ఫున కేసీఆర్ వ‌ద్దకు ప‌లుమార్లు వెళ్లి రాయ‌బారాన్ని ర‌క్తి క‌ట్టించార‌ట‌. రాయ‌బారం న‌డిపిన నేత ఓ పార్టీకి అధినేత‌గానే కాకుండా ఎంపీగా కూడా ఉన్న నేప‌థ్యంలో... త‌మ‌కు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌ద‌రు నేత ప్ర‌తిపాద‌న‌ను కాద‌న‌కూడ‌ద‌న్న భావ‌న‌తోనే ముఖేశ్ ఎంట్రీకి కేసీఆర్ ఊకొట్టిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన నేప‌థ్యంలో నేడో - రేపో త‌న అనుచ‌ర గ‌ణంతో స‌మావేశం కానున్న ముఖేశ్‌... గులాబీ తీర్ధం పుచ్చుకునే తేదీని ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News