అఖిలేశ్‌ ను సీఎం చేయడం తప్పే!

Update: 2017-05-08 05:01 GMT
సమాజ్‌ వాదీ పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు - త‌న పార్టీ రాజ‌కీయ ప్ర‌భ మ‌స‌క‌బార‌డంపై ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ తీవ్రంగా క‌ల‌త చెందుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ అఖిలేశ్ యాదవ్‌ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం తప్పేనని వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత ఆయ‌న నిర్ణ‌యాలను అడ్డుకోలేక‌పోవ‌డం కూడా స‌మ‌స్య‌ల‌కు దారితీసింద‌ని వివ‌రించారు. ప్ర‌ముఖ యాద‌వ నేత‌ ధర్మేంద్ర యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన ములాయం ఈ సంద‌ర్భంగా పార్టీలోని ప‌రిణామాల‌పై స్పందించారు.

గ‌త రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయిందని ములాయం విశ్లేషించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తో పొత్తు వద్దని అఖిలేశ్‌ తో చెప్పానని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ అఖిలేష్ దూకుడుగా ముందుకు పోయార‌ని మండిప‌డ్డారు. త‌ద్వారా కాంగ్రెస్‌ తో పొత్తు వల్ల రాష్ట్రంలో ఎస్పీ ప్రభ కోల్పోయిందన్నారు. అయితే ఎస్పీని తిరిగి బలోపేతం చేస్తామని ప్ర‌క‌టించారు. కాగా,  ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ అబద్ధాల కోరు అని ములాయం సింగ్ యాద‌వ్‌ విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని హామీనిచ్చి కనీసం రూ.15వేలు కూడా వేయలేదని మండిపడ్డారు.

ఈ సంద‌ర్భంగా త‌న సోద‌రుడు శివపాల్ యాదవ్ ప్రారంభించ‌నున్న సెక్యులర్ మోర్చా పార్టీ గురించి మాత్రం ప్రస్తావించలేదు. ములాయం సింగ్ యాద‌వ్ అధ్య‌క్షుడిగా సొంత పార్టీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు శివ్‌పాల్ యాద‌వ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే మీడియాతో మాట్లాడిన ములాయం త‌న‌కు పార్టీ ఏర్పాటు స‌మాచారం లేద‌ని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News