సమాజ్ వాది పార్టీలో పిల్లాటలు

Update: 2016-12-31 09:32 GMT
ఒక దశలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అంతా భావించిన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు వయసు పెరుగుతున్న కొద్దీ మతి భ్రమిస్తున్నట్లుగా ఉంది. కొడుకుతో గొడవల నేపథ్యంలో ఆయన వేస్తున్న ఆనాలోచిన ఎత్తుగడలు పిల్లాటలను తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న కుమారుడు అఖిలేశ్ ను పార్టీ నుంచి బహిష్కరించడమే అతి పెద్ద రాంగ్ స్టెప్ కాగా ఒక్క రోజులోనే మళ్లీ రాజీ కుదుర్చుకోవడం మరింత పిల్లాటగా కనిపిస్తోంది. ఇందులో రాజకీయ పరిణతి కంటే ములాయం మానసిక స్థితి ఎలా ఉందన్న కోణమే ఎక్కవగా కనిపిస్తోంది.

వివాదాస్పద నేతగా పేరుపడిన ఆజం ఖాన్ చొరవతో తాజా ముసలం చల్లారింది. ఆజం ఖాన్ చొరవ తీసుకుని ఈ రోజు తండ్రీకుమారులిద్దరితో సమావేశం నిర్వహించారు.  పార్టీలో ఆటుపోట్లు - తండ్రి ఆగ్రహాన్ని చవిచూస్తున్నప్పటికీ అఖిలేశ్ ఇంకా ములాయం పట్ల గౌరవంగానే ఉండడంతో ఆజం ఖాన్ ఆయన్ను తొలుత సంప్రదించారు. తరువాత ములాయంను కూడా చల్లార్చి కొడుకుపై కోపం పోయేలా చేశారట.
    
అఖిలేశ్ యాదవ్ పై వేసిన బహిష్కరణ వేటును కొద్దిసేపటి కిందట ములాయం ఎత్తివేశారు. ఇది మంచి పరిణామమే కావొచ్చు... సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయినట్లు అనిపించవచ్చు కానీ.... దేశంలో కాంగ్రెస్, బీజీపీల తరువాత అధికారం చేపట్టగల అతి పెద్ద పార్టీగా ఉన్న సమాజ్ వాదిని నడిపిస్తున్న ములాయం అయోమయ స్థితికి ఇది దర్పణం పడుతోంది.
    
పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ - ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ల మధ్య రాజీ కుదిరింది. అఖిలేష్ - ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ లపై నిన్న విధించిన ఆరేళ్ల సస్పెన్షన్ ను ఎత్తివేసి, మళ్లీ వారిని పార్టీలోకి తీసుకున్నారు. దీంతో, పార్టీలో నెలకొన్న హైడ్రామాకు తెరపడింది.  ఈ సయోధ్య ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ సమాజ్ వాది పార్టీని నమ్మి దానితో కలిసి సాగొచ్చన్న నమ్మకం మాత్రం కాంగ్రెస్ - భాజపాలకు ప్రత్యామ్నాయంగా కూటమి కట్టాలన్న మిగతా పార్టీల్లో పోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News