బాబు పంచాయితీ ఫెయిల‌య్యింది

Update: 2016-08-12 07:54 GMT
టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో స‌ద్దుమ‌ణిగింద‌నుకున్న‌ ఆధిప‌త్య పోరు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరుతున్నాయి. `మేము లేక‌పోతే మీరు ఎమ్మెల్యేగా గెల‌వ‌లేరు` అని ఒక వ‌ర్గం అంటుంటే.. `మీ అండ లేక‌పోయినా గెలిచేవాళ్లం` అని మ‌రో వ‌ర్గం కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు  సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగి పంచాయ‌తీ చేశారు. కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నేత‌లు మ‌ళ్లీ క‌త్తులు దూసుకుంటున్నారు, దీంతో బాబు పంచాయ‌తీ ఫెయిలయ్యింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యే - ఏపీ దేవాదాయ శాఖా మంత్రి పైడికొండ‌ల మాణిక్యాలరావుకు - నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌ చార్జి - ప‌శ్చిమగోదావ‌రి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజుకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం ఉంది. 2014 ఎన్నికల్లో మాణిక్యాలరావు గెలిచారంటే అది తమ చలవేనని - తాము మద్దతు ఇవ్వకపోతే ఆయన గెలిచేవారు కాదని టీడీపీ ప్రచారం చేస్తూ వస్తోంది. తమ్ముళ్ల మద్దతు లేకపోయినా గెలిచేవారమని.. నరేంద్ర మోడీ హవాతోనే తాము విజయం సాధించామని బీజేపీ కౌంటర్‌ ఇస్తూ వస్తోంది  

 ఇక అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వాల విష‌యంలో ఇరు వ‌ర్గాలు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఒకానొక ద‌శ‌లో మాణిక్యాల‌రావు త‌న మంత్రి ప‌ద‌వికి సైతం రాజీనామా చేస్తాన‌నే వ‌ర‌కు వెళ్లింది ప‌రిస్థితి. వీటిని గుర్తించిన సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగారు.స‌ర్దుకుపోవాల‌ని. క‌లిసి ప‌నిచేయాల‌ని ఇద్ద‌రికీ న‌చ్చ‌జెప్పారు. అయితే రెండు నెల‌లు ఎవ‌రికి వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారి మ‌ధ్య స‌రికొత్త వివాదం చెల‌రేగింది.

  ఇటీవల బాపిరాజు అమెరికా పర్యటనకు వెళ్లిన‌ప్పుడు మిలటరీ మాధవరం - వెంకట్రామన్నగూడెంలలోని పీహెచ్‌ సీలకు కమిటీలు వేయించారు. తాడేప‌ల్లిగూడెం మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌ ను మార్పించారు - ఇది తెలిసిన బాపిరాజు.. మాణిక్యాల‌రావుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే నియోజకవ‌ర్గ అభివృద్ధిపై మంత్రిగారు... బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. మరి  సీఎం జోక్యం చేసుకున్నా వివాదాలు ఇలానే ఉంటే ఇంకెలా వీరి గొడ‌వ‌లు స‌మ‌సిపోతాయో అనే చ‌ర్చ మొద‌లైంది.

Tags:    

Similar News