ముంబై పేలుళ్ల దోషుల‌కు శిక్ష ఖ‌రారు!

Update: 2017-09-07 10:04 GMT
1993 నాటి ముంబయి పేలుళ్లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ముంబైలో ఒకే సారి 12 చోట్ల బాంబు పేలుళ్ల‌కు ఉగ్ర‌వాదులు తెగ‌బ‌డ్డారు. ఆనాడు ఉగ్ర‌వాదుల ఉన్మాదానికి 257 మంది అమాయ‌కులు అశువులు బాశారు. మ‌రో 713 మంది గాయ‌ప‌డ్డారు. మ‌హిళ‌లు - చిన్న పిల్ల‌లు స‌హా అనేక మంది ఈ దారుణ కాండ‌కు బ‌లిప‌శువుల‌య్యారు. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంకు అత్యంత స‌న్నిహితుడు అబూ స‌లేం ఆధ్వ‌ర్యంలో ఈ మార‌ణ హోమం జ‌రిగింది. ఈ కేసులో రెండో విడత విచారణ చేపట్టిన ప్రత్యేక టాడా కోర్టు.. జూన్‌ 16న ఆరుగురిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. అబూసలేం - ముస్తఫా దోసా - కరీముల్లాఖాన్‌ - ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌ - రియాజ్‌ సిద్దిఖీ - తాహిర్‌ మర్చంట్‌ లను దోషులుగా తేల్చింది. వీరిలో ముస్తఫా దోసా గుండెపోటుతో మరణించాడు. దీంతో మిగిలిన ఐదుగురికి ముంబయిలోని ప్రత్యేక టాడా న్యాయస్థానం ఈ రోజు శిక్ష ఖ‌రారు చేసింది.  తాహిర్‌ మర్చంట్‌ - ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌ కు ఉరిశిక్ష విధించింది. అబూసలేం - కరీముల్లాఖాన్‌ కు జీవితఖైదుతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది. మరో దోషి రియాజ్‌ సిద్ధిఖీకి 10ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

ఈ కేసులో అబూ స‌లేంకు ఉరి శిక్ష ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, భార‌త దేశంలోని చ‌ట్టాల‌లో ఉన్న లొసుగులు ఈ కేసుతో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. వాటిని ఉప‌యోగించుకొని అబూ స‌లేం వంటి క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాదులు మ‌ర‌ణ శిక్ష‌ల నుంచి త‌ప్పించుకుంటున్నారు. చట్టాల‌లోని డొల్ల‌త‌నం వ‌ల్ల అమాయ‌కుల‌ ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన అబూ స‌లేంకు న్యాయ‌స్థానం జీవిత ఖైదు మాత్ర‌మే విధించ‌గ‌లిగింది. ఈ కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారి గ్యాంగ్‌ స్టర్‌ అబూసలెంకు ఉరిశిక్ష వేయడం కుదరదని టాడా కోర్టు స్పష్టం చేసింది. అబూస‌లేం గతంలో పోర్చుగల్‌ పారిపోయాడు. అయితే అక్కడి పోలీసులు అబూసలేంను అరెస్టు చేసి భారత్‌ కు అప్పగించారు. కానీ, పోర్చుగల్ చ‌ట్టాల ప్ర‌కారం అక్క‌డ‌ గరిష్ఠ శిక్ష జీవితఖైదు మాత్రమే. ఇరుదేశాల మ‌ధ్య ఉన్న నేరస్థుల అప్ప‌గింత  ఒప్పందం ప్రకారం అబూసలేంకు ఉరిశిక్ష విధించడం కుద‌ర‌ద‌ని కోర్టు తెలిపింది. అందుకే అత‌డికి  యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది.

1993 మార్చి 12న ముంబయిలో ఈ మార‌ణ హోమం జ‌రిగింది. డీగ్యాంగ్ కు చెందిన ఉగ్రవాదులు అబూ స‌లేం ఆధ్వర్యంలో వరుసగా 12 చోట్ల బాంబు దాడులకు తెగ‌బ‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ల్లో  257 మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోగా.. 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ దాడుల వెనుక అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం హ‌స్త‌మున్న‌ట్లు నిర్ధారించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం - టైగర్‌ మెమన్‌ - మహ్మద్‌ దోసా - ముస్తఫా దోసాలు కుట్ర పన్ని దాడికి పాల్పడినట్లు సీబీఐ తన విచారణలో తేల్చింది. 14 సంవ‌త్స‌రాల అనంత‌రం  ముంబయిలోని ప్రత్యేక టాడా న్యాయస్థానం 2007లో ఈ కేసు విచార‌ణ‌ను ముగించింది.  దాదాపు 100 మందిని ఈ కేసులో దోషులుగా తేల్చింది. ఈ దాడుల‌కు ఆర్థిక స‌హ‌కారం అందించిన టైగ‌ర్ మెమ‌న్ సోద‌రుడు యాకూబ్‌ మెమన్‌ కు 2013లో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. యాకూబ్ మెమ‌న్ కు 2015లో మ‌ర‌ణ‌ శిక్షను అమలు చేసిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News