యాసిడ్ దాడిపై ముంబై కోర్టు షాకింగ్‌ తీర్పు

Update: 2016-09-08 13:07 GMT
ప్రేమించ‌లేద‌నే కార‌ణంగా యాసిడ్ దాడికి గురై మ‌ర‌ణించిన‌ లెఫ్టినెంట్ న‌ర్స్ ప్రీతి రాఠి కేసులో  ముంబైలోని ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. యాసిడ్ దాడి చేసి ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పొరుగింటి వ్య‌క్తి అంకుర్ ప‌న్వ‌ర్‌ కు ఉరిశిక్ష విధించింది. త‌ద్వారా ప్రేమ కార‌ణంగా చేసే ఆకృత్యాల‌కు క‌ఠిన శిక్ష ఉంటుంద‌నే సందేశాన్ని పంపించింది. ఇదే స‌మ‌యంలో త‌మ సోద‌రిని కోల్పోయిన ప్రీతి సోద‌రుడు హితేష్.. కోర్టు తీర్పు వెలువ‌డ‌గానే అక్క‌డే ఉన్న అంకుర్ ప‌న్వ‌ర్‌ పై దాడి చేశాడు.

ఢిల్లీలో ఉద్యోగం చేసే ముంబై వాసి ప్రీతిని ఆమె ఇంటి ప‌క్క‌నే ఉండే అంకుర్ ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డేవాడు. అయితే ప్రీతి తిర‌స్క‌రించ‌డంతో 2013లో ప్రీతి వెంట డిల్లీ నుంచి ముంబై వ‌ర‌కు ప్ర‌యాణం చేశాడు. త‌నను తిర‌స్క‌రించింద‌న్న అక్క‌సును మ‌న‌సులో ఉంచుకున్న అంకూర్ ముంబై చేర‌గానే బాంద్రా స్టేష‌న్ బ‌య‌ట ఆమెపై యాసిడ్ చ‌ల్లాడు. తీవ్ర గాయాల‌పాలైన ప్రీతి.. నెల రోజుల త‌ర్వాత మ‌ర‌ణించింది. దీంతో కోర్టును ఆశ్ర‌యించిన ప్రీతి కుటుంబ స‌భ్యులు నిందితుడికి త‌గిన శిక్ష విధించాల‌ని కోరారు.  ఏమాత్రం ద‌యాదాక్షిణ్యాలు లేకుండా అంకుర్ ఈ దాడి చేశాడ‌ని, అందువ‌ల్ల అత‌నికి పెద్ద శిక్ష విధించాలనే ప్రాసిక్యూష‌న్ వాద‌న‌తో ప్ర‌త్యేక కోర్టు ఏకీభ‌వించింది. అంకుర్‌ కు ఉరిశిక్ష విధించింది.
Tags:    

Similar News