తెలంగాణ హీటెక్కింది... పుర పోరుకు నగారా మెగింది

Update: 2019-12-23 13:52 GMT
తెలంగాణలో రాజకీయం మరోమారు హీటెక్కిందనే చెప్పాలి. రాష్ట్రంలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. కొత్త ఏడాది తొలి నెలలోనే ముగియనున్న ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలు, ఆపై ఈ ఏడాది తొలి ప్రథమార్ధంలో సార్వత్రిక ఎన్నికలు, మొన్నటికి మొన్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలతో ఏడాదంతా ఎన్నికల కోలాహలంలోనే కొనసాగిన తెలంగాణ... వచ్చే ఏడాదిని కూడా ఎన్నికల సమరాంగణంతోనే ప్రారంభించనుంది.

తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసిన మునిసిపల్ ఎన్నికల ప్రకటన వివరాల్లోకి వెళితే... జనవరి 7న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 8 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణకు గడువు విధించారు. అలాగే 12, 13 తేదీల్లో తిరస్కరించిన నామినేషన్లను అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. జనవరి 22న పోలింగ్‌ నిర్వహించి, 25న ఫలితాలను వెల్లడించనున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలు జరుగనున్నాయి.

తెలంగాణలో పురపాలక సంఘాలకు పదవీకాలం ముగిసినప్పటికీ వార్డుల విభజన, న్యాయ వివాదాల కారణంగా ఎప్పటికప్పుడు మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతూనే వచ్చింది. అంతేకాకుండా ఈ ఎన్నికలపై కోర్టుల్లో సుదీర్ఘ వాదనలూ జరిగాయి. అయితే వార్డుల విభజన పూర్తి కావడం, ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపేసింది.
Tags:    

Similar News