మునుగోడు బ‌రిలో కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలో ఉంది ఈ న‌లుగురేనా?

Update: 2022-08-25 12:32 GMT
మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ త‌ర‌పున న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ఆ పార్టీ ప‌రిశీలిస్తోంది. ఈ దిశ‌గా తెలంగాణ కాంగ్రెస్ చ‌ర్య‌లను వేగ‌వంతం చేసింది. ఆగ‌స్టు చివ‌రలోగా అభ్య‌ర్థి ప్ర‌క‌టిస్తామ‌ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్ర‌మంలో మునుగోడు పార్టీ టికెట్ ఆశిస్తున్న న‌లుగురు అభ్య‌ర్థుల‌తో రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మయ్యారు.

ఈ స‌మావేశానికి మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ పాల్వాయి గోవ‌ర్థ‌న‌ర్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్ర‌వంతి, చ‌ల్ల‌మ‌ల్ల కృష్ణారెడ్డి, జ‌ర్న‌లిస్టు సంఘాల నేత‌ ప‌ల్లె ర‌వి, కైలాష్ నేత‌ హాజ‌ర‌య్యార‌ని చెబుతున్నారు. అయితే ఈ న‌లుగురిలోనే ఒక‌రికి మునుగోడు సీటు ల‌భించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.  

మునుగోడు ఉప ఎన్నిక‌కు టికెట్ ఆశిస్తున్న అభ్య‌ర్థుల‌తో రేవంత్ రెడ్డి స‌మావేశ‌మైన సంద‌ర్భంగా వారి నుంచి అభిప్రాయాలు సేక‌రించారు. కాగా, ఆశావహుల బలాబలాపై కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త‌ సునీల్‌ కనుగోలు ఇప్పటికే పీసీసీకి నివేదిక అందించార‌ని సమాచారం.

న‌లుగురు అభ్య‌ర్థులతో భేటీ అయ్యాక‌ హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణికం ఠాగూర్‌తో రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భేటీ అయ్యారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి పీసీసీ నివేదిక పంపనుంద‌ని చెబుతున్నారు. ఆ త‌ర్వాత ఏఐసీసీ ఆమోదించిన వారినే మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిగా పీసీసీ ప్రకటించనుంది.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ త‌ర‌ఫున కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి బ‌రిలోకి దిగడం ఖాయమే.

మరోవైపు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఢిల్లీ వెళ్లి ప్రియాంక గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌లో ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించామని తెలిపారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తనను కలవమన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై చర్చించాన‌న్నారు.
Tags:    

Similar News