మునుగోడు కౌంటింగ్: ఇంత లెక్క ఉంది.. మొదటి రౌండ్ ఏది? చివరి రౌండ్ ఏ మండలం?

Update: 2022-11-06 02:30 GMT
దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా పేరు తెచ్చుకున్న మునుగోడులో విజయం ఎవరిదన్నది తేలేది నేడే. ఆదివారం ఉదయం మొదలు కానున్న ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారికంగా ఈ ఎన్నికల ఫలితాన్ని మధ్యాహ్నం2 గంటల ప్రాంతంలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే.. ఎన్నికల ఫలితంపై ఒక క్లారిటీ ఉదయం 10-30 గంటల లోపే వచ్చే వీలుంది.

పోటాపోటీగా సాగితే తప్పించి.. మిగిలిన సందర్భాల్లో ఉదయం పదకొండు గంటల లోపే ఫలితం లెక్క తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. 8.20 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలి రౌండ్ ఫలితం తొమ్మిది గంటలకు వస్తుందని చెబుతున్నారు. ఎప్పటిలానే తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో మొదలు పెట్టి.. ఒక్కొక్క రౌండ్ ను లెక్కిస్తూ ముందుకు సాగనున్నారు.

మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 కాగా..మునుగోడు ఓట్ల లెక్కింపును 15 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో టేబుళ్ల సంఖ్య 21. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,41,805 ఓట్లు కాగా.. ఇందులో 2,25,192 మంది ఓట్లు వేశారు. వీరిలో 1,13,853 మంది పురుషులు కాగా.. 1,11,338 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డిల మధ్యే నెలకొంది. స్వతంత్ర్య అభ్యర్థిగా కేఏ పాల్ ఉన్నప్పటికీ.. ఆయనకు వచ్చే ఓట్ల అతి తక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.

గెలుపుపై ఇప్పటికే టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేయటం.. దీనికి తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ లోనూ ఒకట్రెండు సంస్థలు తప్పించి మిగిలినవన్నీ టీఆర్ఎస్ కే గెలుపు ఖాయమని తేల్చి చెబుతున్నాయి. మరే ఎన్నికకు లేని ప్రత్యేకత మునుగోడు ఉప పోరుకు ఏమంటే.. రెండు.. మూడుస్థానాల్లో ఎవరు నిలవనున్నారు? అన్న ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రాజకీయాల ప్రభావం ఈ ఉప ఎన్నిక ఫలితం ఆధారంగా సాగనునుండటమే కారణంగా చెప్పొచ్చు.

ఓట్ల లెక్కింపుమొదలైన గంటకు అంటే తొమ్మిది గంటలకు మొదటి రౌండ్ ఫలితం విడుదల కానుంది. తొలుత ఓట్ల లెక్కింపు జరిగే మండలంగా చౌటుప్పల్ నిలవనుంది.. తొలి ఫలితం వెల్లడయ్యే పోలింగ్ బూత్ చౌటుప్పల్ మండలం జైకేసారం కాగా.. తర్వాత సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌. చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం ఒంటి గంటకు వెల్లడి కానుంది.చివరి రౌండ్ ఫలితం వెల్లడయ్యే పోలింగ్ బూత్ నాంపల్లి మండలం మహ్మదాపురం. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ క్రిష్ణ.. ఆర్వో రోహిత్ సింగ్ తో పాటు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పర్యవేక్షకుల ఆధ్వర్యంలో కౌంటింగ్ జరగనుంది. బరిలో ఉన్న పార్టీల నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. మరి.. ఈ హై ఓల్టేజ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేది ఎవరన్నది మరికాసేపట్లో క్లారిటీ రానుందని చెప్పాలి.
Tags:    

Similar News