మునుగోడు గులాబీ అభ్యర్థి అతనేనా? డిసైడ్ చేశారా?

Update: 2022-08-10 15:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది మునుగోడు ఉప ఎన్నిక. మిగిలిన ఉప ఎన్నికకు తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీయొచ్చన్న అంచనా అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీకి చేరిన నేపథ్యంలో వస్తున్న ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీ కారణంగా చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు చాలానే ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ అధిక్యతకు చెక్ పెట్టటంతో పాటు.. అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు క్రమపద్దతిలో మొదలు కావటం ఖాయంగా ఉంటుంది. ఒకవేళ అధికార టీఆర్ఎస్ కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తాము చెప్పినట్లే తెలంగాణలో బీజేపీ బలమంతా బలుపు కాదు వాపు మాత్రమేనని.. కావాలనే వారు హైప్ చేస్తున్నారన్న ప్రచారాన్ని బలంగా వినిపిస్తారు. అదే సమయంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న కమలనాథుల మనో స్థైర్యాన్ని భారీగా దెబ్బ తీస్తుందని చెప్పక తప్పదు.

ఇలా.. రకరకాల విశ్లేషణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరో మూడు.. నాలుగు నెలల తర్వాత మాత్రమే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఎన్నికల వాతావరణం పార్టీలను పట్టేసింది. ఇలాంటివేళ.. అధికారపార్టీ అభ్యర్థి ఎవరు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే నాలుగు పేర్లు వినిపిస్తున్నా? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? అన్న దానిపై బోలెడంత చర్చ నడుస్తోంది. అయితే.. ఈ రోజు (మంగళవారం) టీఆర్ఎస్ పార్టీకి చెందిన మీడియా సంస్థలో మునుగోడు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికేనా? అంటూక్వశ్చన్ మార్కు వేసి కథనాన్ని అచ్చేశారు.. అంటే దాదాపుగా ఆయనకే టికెట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

అందరిని పక్కదారి పట్టించేందుకు ప్రత్యేక వ్యూహంలో భాగంగా ఆయన పేరుతో కథనాన్ని అచ్చేయమని కేసీఆర్ అండ్ కో నుంచి ఆర్డర్ వచ్చి.. దానికి అనుగుణంగా స్టోరీని ప్లాన్ చేసి ఉంటే వేరే అభ్యర్థి తెర మీదకు రావొచ్చు కానీ లేని పక్షంలో ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నిజానికి ఆయన కాకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి.. బూర నర్సయ్య గౌడ్.. కర్నె ప్రభాకర్ పేర్లు కూడా ప్రధానంగా తెర మీదకు వచ్చినా ఎక్కువ అవకాశాలు మాత్రం కేసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఎక్కువని చెబుతున్నారు.

పార్టీ అధినాయకత్వం చేయించిన సర్వేల్లో నియోజకవర్గ ప్రజలు ఆయనవైపే ఉన్నట్లుగా వచ్చిందని అందుకే ఆయనకు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూసుకుంట్ల చురుకుగా ఉండటంతో పాటు.. అనేకసార్లు జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది. ఇల్లందకుంట వద్ద జరిగిన ఉద్యమం వేళ నమోదైన కేసులో భాగంగా ఆయన ఏకంగా 28 రోజులు జైల్లో ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ కారణంతోనే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వారికి టికెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారన్న మాటను హైలెట్ చేసేందుకు ఇలా చెప్పి ఉంటారని చెబుతున్నారు. అధికార పార్టీ మీడియాలో ఫోటో వేసి.. ఆయన గురించి గొప్పగా రాసిన తర్వాత ఆయనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుంటే మెజార్టీ శాతం ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News