మునుగోడు బ్యాలెట్ పేపర్ చిచ్చు: రేవంత్ అభ్యంతరం వెనుక కారణమేంటి?

Update: 2022-10-20 05:35 GMT
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకూలంగా బ్యాలెట్ పేపర్ తయారు చేయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లు ఈ మేరకు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రిటర్నింగ్ అధికారులు టీఆర్ఎస్ గుర్తును పోలిన వాటిని తొలగించారని.. టీఆర్ఎస్ కారు గుర్తుకు అనుకూలంగా బ్యాలెట్ ముద్రించారని ఆరోపణలు వస్తున్నాయి.

బ్యాలెట్ పేపర్ పై టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కారణం ఏంటంటే.. టీఆర్ఎస్ అభ్యర్థిని రెండో స్థానంలో ఉంచడమే.. బ్యాలెట్ పేపర్ మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా బ్యాలెట్ పేపర్ నమూనాను రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. మొదటి స్థానంలో బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఉన్నారు. మూడోస్థానంలో బీజేపీ అభ్యర్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాలుగో స్తానంలో కాంగ్రెస్ అభ్యర్తి పాల్వాయి స్రవంతి ఉన్నారు. అయితే ఈ బ్యాలెట్ పేపర్ కూర్పుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిబంధనల ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ముందు ఉండాలని.. ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఎస్పీ అభ్యర్థి స్థానంలో బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉండాలని అంటున్నారు. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి 4వ స్థానంలో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు విరుద్ధంగా రెండో స్తానంలో ఎలా పెడుతారని ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలను మరోసారి పరిశీలించి టీఆర్ఎస్ అభ్యర్థి పేరును 4వ స్తానంలో పెట్టాలని దీనిపై ఈసీ నిర్ణయించాలని.. లేకుంటే న్యాయపోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈసీ అధికారులు తాజాగా గుర్తుల కేటాయింపులో టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన రోడ్డురోలర్ ను కోరిన అభ్యర్థికి కేటాయించకుండా పక్కనపెట్టారు. అలాగే బ్యాలెట్ పేపర్ ముద్రణకు పంపారు. దీనిపై ఆ అభ్యర్థి , బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈసీ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ బ్యాలెట్ ముద్రణను ఆపివేయించి అధికారులను పక్కనపెట్టినట్టు సమాచారం.

మొత్తంగా మునుగోడులో బ్యాలెట్ పేపర్ల ముద్రణ, కేటాయింపులు కూడా తీవ్ర వివాదంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ చేష్టలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News