మునుగోడు రేసు గుర్రాలివేనా? ఖరారు చేసినట్లేనా?

Update: 2022-08-11 03:54 GMT
హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో అన్ని రాజకీయ పార్టీలు తలమునకలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కసరత్తు వేగంగా పూర్తి చేయటం ద్వారా.. మిగిలినపనుల మీద ఫోకస్ పెట్టొచ్చన్న ఆలోచనలో ఉన్న పార్టీలు.. ఆ పనిని దాదాపుగా పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. ప్రాధమికంగా అభ్యర్థులు ఫలానా అన్నంతనే వచ్చి పడే అసంతృప్తులను బుజ్జగించి.. ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తే సమస్యలు తగ్గుతాయన్న ఆలోచనల్లో పార్టీలు ఉన్నట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మరోసారి బరిలోకి దించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓకే అన్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూసుకుంట్లను అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేశారన్న వాదన బయటకు వచ్చినంతనే పలువురు నేతలు అంతర్గతంగా విభేధించినట్లుగా తెలుస్తోంది. ఆయన బలహీనమైన అభ్యర్థి అని.. ఆయన బరిలోకి దిగితే ఓడిపోవటం ఖాయమన్నట్లుగా వాదనలు వినిపించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దనే మాటను స్పష్టం చేస్తూ అధినాయకుడికి లేఖ రాయటం.. అందుకు భిన్నంగా కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో అసంతృప్తులు తెర మీదకు వచ్చారు. దీంతో.. నల్గొండ ఉమ్మడి జిల్లాకు మంత్రి అయిన జగదీశ్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో చర్చలు జరపటం గమనార్హం. అంతేకాదు.. అసంతృప్తులుగా ఉన్న పలువురు ఎంపీటీసీలు.. జెడ్పీటీసీలు.. మార్కెట్ కమిటీ ఛైర్మన్లు తదితర నేతల్ని ప్రగతి భవన్ కు తీసుకెళ్లి.. అక్కడ సీఎం కేసీఆర్ తో కల్పించినట్లుగా సమాచారం.

పార్టీ నిర్ణయించిన కూసుకుంట్ల అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని.. ఆయన్నుగెలిపించటంలో కీలకంగా వ్యవహరించాలని వారిని ఒప్పించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థి అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అన్ని వ్యవహారాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఆయన పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు.

మునుగోడు బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థి విషయంలోనూ స్పష్టత వచ్చేసినట్లేనని చెబుతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానంలో చల్లమల్ల క్రిష్ణారెడ్డిని దాదాపుగా ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. ఆయన పేరు బయటకు వచ్చినంతనే పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. ఆయనకు టికెట్ ఇస్తే మునుగోడులోనూ హుజూరాబాద్ ఫలితం రిపీట్ అవుతుందంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. దీంతో.. అసంతృప్తివాదుల్ని సమాధానపరిచే కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలమునకలైనట్లుగా తెలుస్తోంది. అర్థికంగా బలంగా ఉంటే అతగాడు బరిలో ఉంటే.. చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న వాదనను రేవంత్ అండ్ కో బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక.. బీజేపీ అభ్యర్థిగా తాజాగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధికారికంగా కమలం పార్టీ ఖరారు చేయనుంది. ఈ నెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి.. పార్టీ అగ్రనాయకత్వంలో కీలకంగా వ్యవహరించే అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభ నుంచి రాజగోపాల్ రెడ్డి ప్రచార పర్వం మొదలుకానున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా మునుగోడు రేసుగుర్రాలు దాదాపు ఫైనల్ అయినట్లేనని చెప్పక తప్పదు. అధికారికంగా ప్రకటించిన తర్వాత నుంచి ప్రచార హడావుడి షురూ కానుంది.
Tags:    

Similar News