'మునుగోడు'పై కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం.. ఇదే!

Update: 2022-08-18 06:30 GMT
ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఖాయ‌మైన ద‌రిమిలా.. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ద‌క్కించుకోవాల‌ని.. కాంగ్రెస్ నిర్ణ‌యించుకుంది. దీనికి గాను ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న అగ్ర నాయ‌కులు.. తాజాగా మూడు మంత్రాల‌తో మునుగోడును జ‌యించాల‌ని.. త్రిముఖ వ్యూహంతో ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో ఒక‌టి.. పార్టీని మ‌రింత బ‌లంగా ఇంటింటికీ చేర్చ‌డం. రెండు.. గాంధీ కుటుంబ త్యాగాల‌ను, కేసీఆర్ న‌య‌వంచ‌న పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం. మూడు.. "మన మునుగోడు మన కాంగ్రెస్‌" నినాదంతో ప్ర‌జ‌ల్లో సెంటిమెంటు ర‌గిలించ‌డం.

ఈ త్రిముఖ వ్యూహంతో కాంగ్రెస్ మునుగోడులో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని కీల‌క నాయ‌కులు భావిస్తున్నారు. తాజాగా..  హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ గ్రామ సమన్వయకర్తల సమావేశంలో పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్‌లో రావచ్చని భావిస్తున్నట్లు ఠాగూర్‌ తెలిపారు.

వంద రోజుల మిషన్‌తో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. గుజరాత్ ఎన్నికలతోపాటు మునుగోడు ఉపఎన్నిక కూడా వస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలన్నారు. సెప్టెంబర్ 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభమవుతుందని.. అక్టోబర్‌ నెలాఖరులోగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. రాబోయే వంద రోజులు చాలా కీలకమని ప్రతి ఒక్కరూ శక్తిమేర పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకు లను అరెస్ట్ చేయడాన్ని ఠాగూర్ ఖండించారు.

రేవంత్రెడ్డి చేసిన హోంగార్డ్ వ్యాఖ్యలు ముగిసిన చాప్టర్ అని మాణిక్కం ఠాగూర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరిన నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై తానేమి మాట్లాడనన్నారు. మర్రి శశిధర్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను చూడలేదని.. ప్రియాంక గాంధీ తెలంగాణాకు వస్తానంటే స్వాగతం చెబుతామన్నారు. తెలంగాణ నుంచి పోటీచేయాలని రాహుల్, ప్రియాంకలను ఆహ్వానిస్తే వాళ్లు ఆలోచిస్తారని.. కాంగ్రెస్లో చేరికలన్నింటిని ప్రియాంకా గాంధీ పర్యవేక్షిస్తున్నారని మాణిక్కం ఠాగూర్‌ వెల్లడించారు.

"నేను సోనియా ఏజెంట్ని మాత్రమే ఎవరి ఏజెంట్ని కాదు. పార్టీని నడిపించాల్సింది పీసీసీ కెప్టెన్. బీజేపీలో చేరిన నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు. నేను అధిష్ఠానానికి వారధిని మాత్రమే. ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. మేము ఇద్దరం మంచి స్నేహితులం. ఇంటికి పిలిచి మరీ బిర్యానీ పెట్టారు. నాయకులు ముఖ్యం కాదు పార్టీనే ముఖ్యం.'' అని ఠాకూర్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News