షాక్‌: వైసీపీ నేత హ‌త్య కుట్ర‌లో మంత్రి హ‌స్తం!

Update: 2017-11-25 06:07 GMT
కొన్ని ద‌శాబ్దాల కింద‌ట ఉమ్మ‌డి ఏపీలో చోటు చేసుకున్న హ‌త్యా రాజ‌కీయాలు మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చాయా?  త‌మ‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారిని లేపేయ‌డ‌మే మార్గ‌మ‌ని అధికార నేత‌లు భావిస్తున్నారా?  దీనికిగాను కిరాయి హంత‌కుల‌తో ఒప్పందాలు సైతం చేసుకున్నారా? అంటే తాజాగా వెలుగు చూసిన ఓ ఉదంతం ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఏపీ విప‌క్షం వైసీపీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత‌ను హ‌త్య చేసేందుకు భారీ కుట్ర జ‌రిగింది. దీనికి గాను ఓ ప‌ది మంది కిరాయి హంత‌కుల‌తో ఒప్పందం కూడా జ‌రిగిపోయింది. డ‌బ్బులు కూడా పంపిణీ అయిపోయాయి. ఇక‌, హ‌త్యే జ‌ర‌గాల్సి ఉంది. దీనికి కూడా ప‌క్కా ప్లాన్‌తో కిరాయి మూక సిద్ధ‌మైంది. ఇంత‌లో ఈ మొత్తం ఘ‌ట‌న యూ ట‌ర్న్ తీసుకుంది!!

అస‌లు విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌నుంజ‌య్ యాద‌వ్ రాజ‌కీయాల్లో కొన్నేళ్లుగా చ‌క్రం తిప్పుతున్నారు. రాయ‌ల‌సీమ‌కు చెందిన ధ‌నుంజ‌య్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అదికారంలోకి తెచ్చేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఆయ‌న బీసీల‌ను వైసీపీ వైపు తిప్పుకొనే చ‌ర్చ‌ల‌ను వేగవంతం చేశారు. ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా అప్ప‌ట్లోనే సంచ‌ల‌నం సృష్టించింది. ధ‌నుంజ‌య్‌కు సీమ‌లో మంచి ప‌లుకుబ‌డి ఉండ‌డం, బీసీ వ‌ర్గాలు ఆయ‌న వెంట వెళ్తుండ‌డంపై వార్త‌లు కూడా భారీగానే వ‌చ్చాయి. అయితే, ఇంత‌లోనే ఆయ‌న‌ను చంపేందుకు కుట్ర జ‌రుగుతోంద‌న్న‌ వార్త‌లు కూడా వెలుగు చూశాయి.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు కూపీ లాగారు. ధ‌నుంజ‌య్ ప్ర‌త్య‌ర్థుల‌పై క‌న్నేశారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం ధనుంజయ్‌ యాదవ్‌ను చంపేందుకు కుట్ర పన్నిన పదిమందితో కూడిన‌ కిరాయి హంతక ముఠాను అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  మాట్లాడుతూ.. ఏపీ మంత్రి పరిటాల సునీత డైరెక్షన్‌లోనే ధనుంజయ్‌ యాదవ్‌ హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే త‌మ పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జ‌గ‌న్ నేతృత్వంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ధ‌నుంజ‌య్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌ని, దీనిని ఓర్చుకోలేకే ఆయ‌న హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌ని విమ‌ర్శించారు. అయినా కూడా తాము ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌ని వెల్లడించారు. 2019 లేదా అంత‌కు ముందే ఎన్నిక‌లు వ‌చ్చినా జ‌గ‌న్ గెలుపు త‌థ్య‌మ‌ని చెప్పారు. తాజా హ‌త్య‌కు కుట్ర‌ప‌న్నిన వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. కాగా, ఈ కుట్ర ఉదంతం వెలుగు చూడ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర సంచ‌ల‌నంగా  మారింది.
Tags:    

Similar News