పాక్ ను ముషార్ర‌ఫ్‌ అడ్డంగా బుక్ చేశారే!

Update: 2017-08-31 07:03 GMT
అండ‌ర్ వ‌రల్డ్ డాన్ పేరిట‌ నేరమ‌య సామ్రాజ్యానికి అధినేత‌గా కొన‌సాగుతున్న దావూద్ ఇబ్ర‌హీం వేర్ అబౌట్స్‌ కు సంబంధించి ఇప్పుడు నిజంగానే ఫుల్ క్లారిటీ వ‌చ్చింద‌నే చెప్పాలి. 1993లో ముంబైలో చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల‌కు సూత్ర‌ధారిగా వ్య‌వ‌హ‌రించి వంద‌ల మంది ప్రాణాల‌ను హరించేసిన దావూద్‌... ఆ వెంట‌నే దేశం వ‌దిలి పారిపోయాడు. దేశం నుంచి వెళ్లిన త‌ర్వాత అత‌డు ఎక్క‌డున్నాడ‌న్న విష‌యం కొంతకాలం పాటు ఏ ఒక్క‌రికీ తెలియ‌రాలేదు. అయితే ఉగ్ర‌వాదమ‌నే అస్త్రంతో భార‌త్‌ లో అల్ల‌క‌ల్లోలం సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న దాయాదీ దేశం పాకిస్థాన్‌ కు మించి సేఫెస్ట్ ప్లేస్ అత‌డికి క‌నిపించ‌లేదు. ఈ వాద‌న నిజ‌మేన‌న్న‌ట్లు ముంబై మార‌ణ‌హోమం వెంట‌నే మాయ‌మైపోయిన దావూద్ నేరుగా పాకిస్థాన్‌ లోని క‌రాచీలో తేలాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా అత‌డు అక్క‌డే విలాస‌వంత‌మైన జీవితం గ‌డుతున్నాడు. అంతేనా అత‌డి లగ్జ‌రీ లైఫ్‌ కు ఏమాత్రం కొద‌వ రాకుండా చూసుకునే బాధ్య‌త‌ను పాక్ ప్ర‌భుత్వం అక్క‌డి సైన్యానికి అప్ప‌గించింద‌ట‌.

ఉండేది పాక్ లోనే అయినా... ఇప్ప‌టికీ భార‌త్‌ లోని చీక‌టి సామ్రాజ్యం మొత్తం అత‌డి క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తోంద‌న్న వాద‌న‌ను ఏ ఒక్క‌రు కాద‌న‌లేనిదే. దేశంలో జ‌రిగే ప్ర‌తి అరాచ‌కం వెనుక అత‌డి హ‌స్తం ఉంటోంది. ఈ క్ర‌మంలో అత‌డికి సంకెళ్లు వేసేందుకు - లేదంటే కాల్చి పారేసేందుకు భార‌త్ చేయ‌ని య‌త్న‌మంటూ లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో మ‌న‌మంతా గ్రేట్ ఇండియన్ గూఢ‌చారిగా పిలుచుకుంటున్న జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌ కూడా అత‌డిని వేటాడేందుకు చాలా కాలం పాక్‌ లో మ‌కాం వేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయినా ఇప్పుడు ఉన్న‌ట్లుండి దావూద్ ప్ర‌స్తావ‌న ఎందుక‌న్న విష‌యానికి వ‌స్తే... *మీ దేశంలో మా దేశానికి చెందిన నేర‌స్తుడు ఉన్నాడు... వాడిని మాకు అప్ప‌గించండి* అంటూ భార‌త్ చేస్తున్న విజ్ఞ‌ప్తుల‌ను పాక్ తిర‌స్క‌రిస్తూనే వ‌స్తోంది. *అస‌లు దావూద్ మా దేశంలో లేడు. ఉన్న‌ట్లు ఆధారాలుంటే ఇవ్వండి. అప్పుడు ప‌రిశీలిస్తాం* అంటూ పాక్ చేస్తున్న తొండి వాద‌న‌కు భార‌త్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కూడా ఆధారాలు అంద‌జేస్తూనే ఉంది. అయితే స‌ద‌రు ఆధారాల‌ను అంత‌గా ప‌ట్టించుకోని పాక్‌... దావూద్ త‌మ భూభాగంలో లేడంటే  లేడ‌నే చెబుతోంది.

ఈ క్ర‌మంలో ఆ దేశానికి ఆర్మీ చీఫ్‌ గానే కాకుండా దేశాధ్య‌క్షుడిగా ప‌నిచేసిన జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. భార‌త రికార్డుల్లో పరారీలో ఉన్న దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌ లోనే ఉన్నాడని ముషార్రఫ్ స్ప‌ష్టమైన‌ సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఓ పాకిస్థాన్‌ చానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముషార్రఫ్‌.. దావూద్‌ ను అప్పగించాలన్న భారత్‌ డిమాండ్‌ పై స్పందించారు. 'భారత్‌ చాలాకాలంగా పాక్‌ పై ఆరోపణలు చేస్తోంది. ఎందుకు ఇప్పుడు మనం మంచివారిగా మారి వారికి సహకరించాలి? దావూద్‌ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అతను తప్పక ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. భారత్‌ ముస్లింలను చంపేస్తోంది. దానిపై దావూద్‌ ప్రతిస్పందిస్తున్నాడు' అని ముషార్ర‌ఫ్ అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో పాక్‌ ఆశ్రయంలోనే దావూద్‌ ఉన్నాడన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.
Tags:    

Similar News