బాబు స్కెచ్‌ కు జ‌గ‌న్ కౌంట‌ర్‌

Update: 2016-04-15 10:51 GMT
ఈనెల మొద‌టివారంలో విజయవాడలో నిర్వహించిన ముస్లిం హక్కుల సభ ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది.  వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈ సభను నిర్వహించారు. దీనికి హాజరైన చంద్రబాబు ముస్లిం సంక్షేమం కోసం ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ముస్లింల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ ఎపిసోడ్‌ తో అల‌ర్ట‌యిన ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కౌంట‌ర్ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశారు.

హైదరాబాద్‌ లోని పార్టీ కార్యాలయంలో జామాత్‌-ఇ-ఉలేమా-ఏ హింద్‌ ప్రతినిధుల బృందం భేటీ అయి, మైనార్టీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని జ‌గ‌న్‌ ను కోరారు. ఈనెల 18న మైనార్టీ రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని, రిజర్వేషన్లకు అనుకూలంగా పార్టీ తరుఫున కోర్టుకు స‌మ్మ‌తం తెలపాలని విజ్ఞప్తి చేశారు. విద్యా - ఉద్యోగ విషయాల్లో ముస్లింలు వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వ పథకాలు కూడా అందని పరిస్థితి నెలకొందని వివరించారు. అనంత‌రం ఆ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా మీడియాతో మాట్లాడుతూ ముస్లిం - మైనార్టీ రిజర్వేషన్లకు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. మైనార్టీ రిజర్వేషన్లకు తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

ముస్లిం ఓట్ల‌ను కొల్ల‌గొట్టే క్ర‌మంలో టీడీపీ ఏర్పాటుచేసిన ఆత్మీయ స‌భ‌కు కౌంట‌ర్‌ గానే ముస్లిం మ‌త‌పెద్ద‌ల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యార‌ని అంటున్నారు. ఓటు బ్యాంకు విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించేందుకు జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీ నేత‌లు వివ‌రిస్తున్నారు.
Tags:    

Similar News