ముస్లిం ఇంట హిందూ సంప్రదాయంలో పెళ్లి

Update: 2016-04-23 05:01 GMT
ప్రపంచంలో మరే దేశంలోనూ కనిపించని విలక్షణత మన దేశంలోనే కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మనకు మాత్రమే సొంతం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి మాటలు చెబితే చాలామంది చిత్రంగా చూడొచ్చు. రాజకీయ నాయకుల చిల్లర రాజకీయాలు.. కొందరు స్వార్థపరుల కారణంగా దేశంలోని వివిధ మతస్థుల మధ్య సందేహాల పొర కమ్మినట్లుగా కనిపిస్తుంది. అయితే.. నేతల మాటలు.. వాటికి మీడియాలో లభించే ప్రాధాన్యం కారణంగానే ఇలాంటివి కనిపిస్తున్నాయే కానీ.. వాస్తవం అందుకు భిన్నమన్న భావన తాజా ఘటనను చూస్తే అర్థమవుతుంది.

ముస్లిం మత ధర్మాన్ని పూర్తిగా పాటించే ఒక ముస్లిం కుటుంబం.. తమ కుమార్తె వివాహాన్ని హిందూ సంప్రదాయంలో నిర్వహించటమే కాదు.. దానికి పిల్లాడి తరఫు వారిని ఒప్పించటం విశేషం. ఇలాంటి ఘటనకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రం పాలెంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన రఫీకి హిందూ మత సంప్రదాయాలంటే చాలా ఇష్టం. తన కుమార్తె రష్మీ వివాహాన్ని హిందూ సంప్రదాయంలో చేయాలని ఆయన కోరిక.

ఇదే విషయాన్ని పెళ్లి కొడుకు తరఫు వారికి చెప్పి.. వారిని ఒప్పించటంలో రఫీ సక్సస్ అయ్యారు. దీంతో శుభలేఖలు దగ్గర నుంచి పెళ్లి వరకూ మొత్తం హిందూ సంప్రదాయంలో జరగటం విశేషం. పండితుల వేద మంత్రోఛ్చారణలు.. మంగళ వాయిద్యాల నడుమ వధువు రేష్మీ.. వరుడు అబ్దుల్ రహీమ్ ల పెళ్లి వేడుక జరగటం గమనార్హం. కన్నుల పండువగా జరిగిన ఈ వివాహ వేడుకను చూసిన వారే కానీ.. ఈ పెళ్లి గురించి విన్న వారంతా.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనని అనుకోవాల్సిందే.
Tags:    

Similar News