ఐఎస్ మీద ముస్లిం మేధావులు చెప్పిందిదే

Update: 2016-08-07 05:32 GMT
నరరూప రాక్షసులన్న మాటకు అసలుసిసలు ప్రతిరూపాలన్నట్లుగా వ్యవహరించే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులపై ముస్లిం మేధావులు తీవ్రస్వరంతో విరుచుకుపడిన వైనమిది. హైదరాబాద్ లో ‘‘హైదరాబాద్ స్టేట్ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ అధ్యక్షతన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మేధావులు పలువురు ఇస్లామిక్ స్టేట్ మీద మండిపడ్డారు. ఐఎస్ మూక ఇస్లాంకు వ్యతిరేకమని.. మహ్మద్ ప్రవక్త  మార్గంలో నడిచే వారికి విరుద్ధమంటూ స్పష్టం చేయటమే కాదు.. అన్ని వర్గాల వారిని కాపాడటమే ఇస్లాం ధర్మంగా గళం విప్పారు.

ఇస్లాం మార్గాన్ని ఐఎస్ నమ్మటం లేదని.. ఆ గ్రవాద సంస్థకు తామంతా వ్యతిరేకమని ముస్లింలు ముక్తకంఠంతో ప్రకటించాల్సిన తరుణం ఆసన్నమైందని తేల్చి చెప్పటంతోపాటు ఇస్లాం అంటే శాంతి.. ప్రేమ.. సౌభ్రాత్రాలను పంచేదని.. అమాయకుల్ని చంపటం అనాగరికం అంటూ వ్యాఖ్యానించారు. మానవత్వం పెంచటం.. పంచటమే ఇస్లాం తత్త్వమని.. కానీ అల్ ఖయిదా.. తాలిబన్ తరహాలోనే ఐఎస్ పుట్టిందని.. అదంతా ప్రపంచ కుట్రలో భాగంగా అభివర్ణించారు.

జిహాద్ అంటే ఉగ్రవాదం కాదని.. అన్యాయాలు.. అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పటమే.. అందుకోసం చేసే పోరాటమే జిహాద్ అన్న విషయాన్ని స్పష్టం చేశారు. షరియా చట్టం ప్రకారం ఏ వ్యక్తీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని తేల్చి చెప్పిన వక్తలు.. ఆరాచకాలకు వ్యతిరేకంగా జిహాద్ జరిగితే.. ఇప్పుడు అదే జిహాద్ గా ఉగ్రవాదులు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకూ ముస్లింల వైపే వేలెత్తి చూపిస్తారని.. ఐఎస్ అన్నది రాజకీయ సమస్యే కానీ మతపరమైన సమస్య కానే కాదని పేర్కొనటం గమనార్హం. ఐఎస్ వల్ల నష్టపోయింది ముస్లింలేనని తేల్చి వారు.. ఐఎస్ ఇస్లాంకు వ్యతిరేకమని తేల్చి చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News