వారంలో ఒక రోజు ఆఫీస్ కి రావాల్సిందే : హెచ్‌సీఎల్ !

Update: 2020-10-23 05:15 GMT
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రతి ఒక్కరి జీవన శైలిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చింది. ఆ సమయంలో పలు సంస్థలు తమ ఉద్యోగులకి  వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా తమ ఉద్యోగులకి  వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. ఈ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటి నుండే విధులు నిర్వహిస్తున్నారు.  కరోనా వైరస్ ఇప్పటికీ వణికిస్తున్నప్పటికీ దాని తీవ్రత మాత్రం కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. దీనితో పలు  కంపెనీలు కరోనా  నిబంధనలు పాటిస్తూ 30 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపిస్తున్నాయి. అలాగే ఆఫీసుల్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాయి.

తాజాగా, ఇప్పుడు హెచ్ ‌సీఎల్ టెక్నాలజీస్ కూడా తమ  ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే ఏర్పాట్లు చేస్తోంది. వారంలో ఒక్కరోజు అయినా ఆఫీస్ కి రావాలని ఉద్యోగులను కోరుతోంది. డిసెంబరు నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వారంలో ఒక్క రోజైనా ఆఫీసుకు రావాలని ఉద్యోగులను కోరుతున్నట్టు హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్  చీఫ్ అప్పారావు వీవీ తెలిపారు. ప్రస్తుతం 5 నుంచి 6 శాతం మంది సిబ్బందితో ఆఫీసులో వ్యవహారాలు నిర్వహిస్తోంది. డిసెంబర్ సమయానికి  ఈ సంఖ్యను 20 శాతానికి పెంచాలని ఆలోచన చేస్తుంది. అయితే, అందరినీ ఆఫీసుకు రమ్మని పిలవడం లేదని తెలిపింది. అయితే , ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నవారు, అలాగే, 50 ఏళ్లకు పైబడిన తల్లిదండ్రులు ఉన్నవారు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. అటువంటి వారు వర్క్ ఫ్రం హోంను కొనసాగించవచ్చని తెలిపింది. అలాగే, 50-55 ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగులకు కూడా వెసులుబాటు కల్పిస్తున్నట్టు వివరించింది. దశల వారీగా ఈ ప్లాన్‌ను అమలు చేస్తామని, అయితే ఎక్కడ కూడా 20 శాతానికి దాటకుండా  చూసుకుంటామని అప్పారావు తెలిపారు. 
Tags:    

Similar News