మ‌న‌సు దోచుకోవ‌టం స‌రే.. డ్యామేజ్ మాటేంది ముత్తిరెడ్డి

Update: 2017-10-12 07:12 GMT
ఒక మాట అంటే తిరిగి రెండు మాట‌లు అనే రోజులివి. అందులోకి రాజ‌కీయాల్లో ఉన్నోళ్ల మీద విమ‌ర్శ‌ల రాళ్లు నిత్యం ప‌డుతూ ఉంటాయి. ఇవి స‌రిపోవ‌న్న‌ట్లు క‌దిలించుకొని మ‌రీ.. రాళ్లు వేయించుకునే అల‌వాటున్న నేత‌లు కొంద‌రు ఉంటారు.  అలాంటి వారు దారిన పోయేయి కూడా నెత్తి మీద వేసుకొని వార్త‌ల్లోకి వ‌స్తుంటారు. తాజాగా అలానే ఉంది జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి య‌వ్వారం.

ఈ మ‌ధ్య‌న త‌న జిల్లా క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌పై విమ‌ర్శ‌లు చేసిన ముత్తిరెడ్డికి కౌంట‌ర్ గా ఆయ‌న గారి లీల‌ల్ని క‌లెక్ట‌ర‌మ్మ మీడియాతో పూస‌గుచ్చిన‌ట్లు చెప్ప‌టం తెలిసిందే. చెరువు అభివృద్ధికి నిధులు ఇవ్వలేద‌న్న ముత్తిరెడ్డి విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చే క్ర‌మంలో.. చెరువు శిఖాన్నే క‌చ్జా చేసేశారంటూ అధికార‌పార్టీ ఎమ్మెల్యే మీద‌నే ఆరోప‌ణ‌లు చేయ‌టం సంచ‌ల‌నం సృష్టించింది.

క‌లెక్ట‌రమ్మ‌తో అన‌వ‌స‌రంగా పెట్టుకొని ముత్తిరెడ్డి త‌ప్పు చేశాడే అన్న మాట కొంద‌రి నోటి నుంచి వినిపించింది కూడా. ఇప్ప‌టికే వివాదంలో కూరుకున్న ఆయ‌న‌.. తాజాగా తెలంగాణ పొలిటిక‌ల్ జేఏసీ చీఫ్ కోదండ‌రాం మీద వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. ఈ మ‌ధ్య‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కోదండం మాష్టారిపై చెల‌రేగిపోవ‌టం తెలిసిందే. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కోదండ‌రామ్ లాంటి ఉద్య‌మ‌నేత‌పై ఇంత‌లా విరుచుకుప‌డ‌టం ఏమిటంటూ ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు కూడా.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి మాట‌ల మాంత్రికుడి నోటి నుంచి కోదండం మాష్టారిపై వ‌చ్చిన వ్యాఖ్య‌లు.. సీఎంకు ఇబ్బందిక‌రంగా మారితే.. ముత్తిరెడ్డి లాంటి వారి మాట‌లు వారికి మ‌రెంత న‌ష్టం క‌లిగిస్తాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. అవేమీ ప‌ట్టించుకోని ముత్తిరెడ్డి తాజాగా కోదండంపై విమ‌ర్శ‌లు చేశారు.

త్వ‌ర‌లో కోదండం మాష్టారు చేయ‌నున్న యాత్ర‌ను ఉద్దేశించి.. ఈ కోదండ‌రాం ఎవ‌ర‌య్యా?  మాసిపోయినోళ్లు.. పాచిపోయినోళ్ల‌తో క‌లిసి అయ‌నేదో యాత్ర చేస్తుండు అంటూ చేసిన వ్యంగ్య‌స్త్రం ముత్తిరెడ్డికి మేలు చేయ‌ద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే వివాదాల్లో కూరుకుపోయిన ఎమ్మెల్యే.. కోదండంపై వ్యాఖ్య‌ల‌తో ముఖ్య‌మంత్రి కంట్లో ప‌డాల‌ని ప్ర‌య‌త్నించినా.. చివ‌ర‌కు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మాట్లాడే ముందు.. కాస్త ఆచితూచి మాట్లాడితే మంచిది ముత్తిరెడ్డి.
Tags:    

Similar News