వీరప్పన్ లోని ‘కొత్త’ కోణాన్ని చెప్పిన ముత్తులక్ష్మి

Update: 2016-07-08 08:36 GMT
తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్లోని పోలీస్.. అటవీ సిబ్బందికి నిద్ర లేకుండా చేసిన గంధం చెక్కలు.. ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలీదనే చెప్పలి. ఇటీవల రాంగోపాల్ వర్మ అతగాడి మీద సినిమా తీశారు కాబట్టి.. ఎంతోకొంత తెలిసే పరిస్థితి. పోలీసుల చేసిన రహస్య ఆపరేషన్లో మృతి చెందిన వీరప్పన్ కు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు ఆమె భార్య ముత్తు లక్ష్మి. వీరప్పన్ మీద తానొక పుస్తకం రాయనున్నట్లు చెప్పిన ఆమె.. అతడికి సంబంధించిన కొన్ని విషయాల్ని చెప్పుకొచ్చారు.

అందరూ ద్వేషించే వీరప్పన్ కు తాను భార్యను కావటం తన అదృష్టంగా చెప్పుకుంటున్న ముత్తులక్ష్మి.. అతడ్ని వీర పురుషుడిగా చిత్రీకరించటం గమనార్హం. తన భర్త బంగారమంటున్న ఆమె.. వీరప్పన్ స్మగ్లర్ గా మారటానికి దారి తీసిన పరిణామాలు తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. వీరప్పన్ మీద పుస్తకం రాసిన ఎస్టీఎఫ్ మాజీ చీఫ్ విజయకుమార్ (ఈయనే వీరప్పన్ ను అంతమొందించారు) చివర్లో వచ్చారని.. ఆయనకు తన భర్త గురించి పూర్తిగా తెలీదన్నారు. విజయ కుమార్ కంటే.. అంతకు ముందు ఎస్టీఎఫ్ అధికారిగా వ్యవహరించిన దేవారం కనుక పుస్తకం రాసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వీరప్పన్ కు సంబంధించి ముత్తు లక్ష్మి చెప్పిన మరికొన్ని విషయాలు చూస్తే..

= 15ఏళ్ల వయసులో నన్ను పెళ్లి చేసుకున్నారు.

= పెళ్లి తర్వాత అతడితో కలిసి తిండి తిప్పలు లేకుండా అడవుల్లో తిరిగా.

= మా రెండో అమ్మాయి అడవిలోనే పుట్టింది. అడవిలో వీరప్పన్ తో గడిపిన రోజులన్నీ వింత అనుభూతికి కలిగించేవే.

= అందుకే ఆ విషయాలన్నీ కలిపి ఒక పుస్తకం రాస్తా.

= వీరప్పన్ ఏనుగుల్ని చంపాడని.. చందనపు చెట్లు నరికాడని అంటారు

= కానీ.. అది నిజం కాదు. అతను ఏ మాత్రం లాభపడలేదు. లబ్థి పొందినోళ్లంతా పెద్ద మనుషులే.

= ఆ పెద్దలంతా కలిసి నా భర్తను బలిపశువును చేశారు.  వీరప్పన్ హీరో కాకపోవచ్చు కానీ నాకు మాత్రం వీరఫురుషుడే.

= ఎప్పుడూ నా పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. అతడి భార్యను కావటం నేను చేసుకున్న అదృష్టం.

= వనవాసాన్ని విడవాలని.. ఉత్తరాదికి వెళ్లిపోదామని నేను.. నా తండ్రి ఎంత చెప్పినా వీరప్పన్ ఒప్పుకోలేదు.

= పన్నెండేళ్ల వయసులో చేయని నేరానికి చేతికి సంకెళ్లు వేసి.. కుక్కలా బంధించిన సంఘటనే అతడ్ని మార్చి ఉండొచ్చు.

= ఏనుగు దంతాలు ఎవరో దొంగతనం చేస్తే అధికారులు అనుమానంతో ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారు.

= అందుకే గంధం చెక్కల స్మగ్లర్ గా మారి ఉండొచ్చు.

= అడవిలో క్రూరుడిగా కాక.. సన్యాసిలా జీవించాడు.

= తన ఇంట్లో కూడా ఒక యువతిని ఇన్ఫర్మార్ గా పెట్టారని.. ఆ విషయం చెప్పినా చంపలేదని.. అలా చేస్తే తన కుటుంబాన్ని వేధిస్తారని భావించేవారు.

= ఇన్ఫార్మర్లను పట్టుకున్నా వదిలేసేవాడే తప్పించి.. చంపలేదని.. అలా చంపితే తన వాళ్లను పోలీసులు మట్టుబెడతారని వదిలేసేవారు.

= వీరప్పన్ తో పెళ్లి అయ్యాక నాలుగేళ్లు మాత్రమే అతడితో ఉన్నానని.. ఆ తర్వాత జీవితంలో అరెస్ట్ లు.. అవమానాలు.. జైలు జీవితం అన్ని వెన్నంటి వచ్చాయని.. అవే తనను కష్టాలు ఎదుర్కొనేలా తయారు చేశాయి.
Tags:    

Similar News