నిర్భ‌య కాదు.. ఆమె పేరు జ్యోతిసింగ్‌..

Update: 2015-12-16 13:45 GMT
స‌రిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు.. క‌దులుతున్న బ‌స్సు నుంచి ఒక పారామెడిక‌ల్ విద్యార్థిని కింద‌కు తోసేసిన వైనం.. ఆ త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. త‌న స్నేహితుడితో క‌లిసి సినిమాకు వెళ్లి తిరిగి వ‌చ్చే క్ర‌మంలో బ‌స్సులో ఎక్క‌టం.. అందులో ప్ర‌యాణికులు ఎవ‌రూ లేక‌పోవ‌టం.. డ్రైవ‌ర్..క్లీన‌ర్‌.. మిగిలిన వారి స్నేహితులు క‌లిసి మెడిక‌ల్ స్టూడెంట్‌ ను తీవ్రంగా గాయ‌ప‌రిచి.. మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనంత దారుణంగా హింసించి.. సామూహిక అత్యాచారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు విద్యార్థిని స్నేహితుడిని సైతం తీవ్రంగా గాయ‌ప‌రిచారు.

ఈ విష‌యం దేశం మొత్తాన్ని క‌దిలించి వేసింది. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెకు మెరుగైన వైద్యం ఇచ్చి.. ఒక‌ద‌శ‌లో సింగ‌పూర్ పంపిన‌ప్ప‌టికీ 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె క‌న్నుమూశారు. ఆమె పేరును బ‌య‌ట‌కు ప్ర‌క‌టించ‌కుండా.. దేశం ఆమెకు నిర్భ‌య‌గా నామ‌క‌ర‌ణం చేశారు.

అనంత‌రం మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్యం చేసే వారికి.. లైంగిక‌వేధింపులు గురి చేసే వారికి క‌ఠిన శిక్ష అమ‌లు చేస్తూ.. నిర్భ‌య చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. ఇదంతా జ‌రిగి మూడేళ్లు గ‌డిచింది. తాజాగా.. ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్భ‌య త‌ల్లిదండ్రులు త‌ల్లిదండ్రులు ఆశాదేవి.. బ‌ద్రీనాథ్‌ లు మాట్లాడుతూ.. త‌మ కుమార్తె పేరును ప్ర‌క‌టించారు. త‌న పేరు జ్యోతిసింగ్ గా వారు వెల్ల‌డించారు.

త‌న కూతురి పేరును చెప్పేందుకు తానేమీ సిగ్గుప‌డ‌టం లేద‌ని.. హింస‌కు గురైన వారు త‌మ పేరును దాచాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆమె త‌ల్లి.. త‌న కుమార్తె పేరు జ్యోతిసింగ్ గా ప్ర‌క‌టించారు. ఇక‌పై.. త‌న కుమార్తె జ్యోతిసింగ్ పేరుతోనే గుర్తించాల‌ని కోరారు. త‌ప్పు చేసిన వారు త‌మ పేర్లు చెప్పుకోవ‌టానికి సిగ్గుప‌డాలి కానీ.. తాము దాచాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చారు. ఈ కేసులో అత్యంత దారుణంగా వ్య‌వ‌హ‌రించి మైన‌ర్ అన్న కార‌ణంగా దోషిని ఈ నెల 20న విడుద‌ల చేయనున్నార‌ని.. ఇదెక్క‌డి న్యాయమ‌ని జ్యోతిసింగ్ త‌ల్లిదండ్రులు ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News