సైన్యం న‌ర‌మేధం 50 మంది బ‌లి!

Update: 2021-03-27 13:53 GMT
మ‌య‌న్మార్ లో ప్ర‌జాస్వామ్యయుతంగా గెలిచిన ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించిన అక్క‌డి సైన్యం.. అరాచ‌కాలు సాగిస్తోంది. సైనిక తిరుగుబాటును నిర‌సిస్తూ.. ప్ర‌జాస్వామ్యాన్ని నెల‌కొల్పాలంటూ నిన‌దిస్తున్న ప్ర‌జ‌ల‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే సైన్యం కాల్పుల్లో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోగా.. తాజా మ‌రో 50 మంది చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని మ‌య‌న్మార్ నౌ న్యూస్ పోర్ట‌ల్ వెల్ల‌డించింది.

మ‌య‌న్మార్ లోని మండ‌లే న‌గ‌రంలో శ‌నివారం జ‌రిపిన కాల్పుల్లో 13 మంది చ‌నిపోగా.. మిగతా మంది ఆయా ప్రాంతాల్లో తూటాల‌కు బ‌ల‌య్యార‌ని న్యూస్ పోర్ట‌ల్ వెల్ల‌డించింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిపిన కాల్పుల్లో సుమారు 300 మందికి పైగా నిర‌స‌న‌కారులు నేల‌కొరిగార‌ట‌. అక్క‌డి మీడియాతోపాటు న్యాయ‌వాదులు విడుద‌ల చేసిన నివేదిక ఈ వివ‌రాలు వెల్ల‌డించింది.

ఇదిలాఉండ‌గా.. మ‌య‌న్మార్ లో ఆ దేశ ఆర్మీ సైనిక ద‌ళాల దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల్లో పాల్గొన్న క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ ఆంగ్ హ్లాయింగ్ మాట్లాడుతూ.. చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నందువ‌ల్లే ఆంగ్ సాన్ సూకీ అధికారాన్ని అడ్డుకున్నామ‌ని చెప్పారు. అంతేకాదు.. తాము ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుతున్నామ‌ని, ప్ర‌జ‌లు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోర‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

కాగా.. ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దించిన మిలటరీ.. సూకీని గృహ నిర్బంధంలో ఉంచి, తాను పాల‌న చేప‌ట్టింది. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని సైన్యం కూల‌దోయ‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ.. వినిపించుకోని సైన్యం అధికారాల‌న్నీ త‌న‌వ‌ద్ద‌నే ఉంచుకుంది.
Tags:    

Similar News