అప్పులు పెరిగాయి, వసూళ్లు తగ్గాయి ..9 నెలల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి ఇదే !

Update: 2020-02-04 06:59 GMT
ఏపీ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆదాయానికి పెద్ద గండి పడుతుంది అని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు అని ,అలాగే ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీని మొదటి స్థానానికి తీసుకు వెళ్లారని ప్రభుత్వం పై మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ విధంగా ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో కనీవినీ ఎరుగని ఆర్థిక పతనం చోటు చేసుకొంది. మూర్ఖత్వం, మొండితనం, కక్ష సాధింపు తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలు కనిపించడం లేదు. రాష్ట్రం నుంచి బయటకు పారిపోయేవారే తప్ప రాష్ట్రానికి వచ్చేవారు లేరు. కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు. ఉద్యోగాలు లేవు. ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ లేదు. ఒక ఉన్మాది పాలకుడైతే జరిగే విధ్వంసం ప్రతి అడుగు లో కనిపిస్తోంది. ఈ రాష్ట్రం ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో వ్యాపిస్తోంది అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్భణం బాగా పెరిగింది. పన్ను వసూళ్లు ఏకంగా 7 శాతం మేర తగ్గిపోయాయి. వాహనాల సేల్స్ 31 శాతం పడిపోయాయి. ఇక రాష్ట్రం అప్పులు ఏకంగా 16 శాతం పెరిగాయి. పారిశ్రామికోత్పత్తి నిలిచి విద్యుత్ డిమాండ్ 16 శాతం మేర తగ్గింది అని తెలిపారు. ఇంతగా తగ్గిన రాష్ట్రం దేశంలో ఇది ఒక్కటే. దాదాపు ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఆటో సేల్స్ పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పడిపోయింది అని తెలిపారు. రాష్ట్రాలకు విమానాల రాకపోకలు ఏడు శాతం మేర తగ్గాయి. పన్ను వసూళ్లు కర్ణాటకలో 23 శాతం పెరిగాయి. కానీ ఏపీలో మాత్రం 7 శాతం తగ్గాయి అని తెలిపారు. ఈ తొమ్మిది నెలల్లోనే రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. దీంతో రుణభారం పదహారు రెట్లు పెరిగింది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంతగా అప్పులు చేయలేదు అని ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు.

అలాగే ఇదే సమయంలో అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీని ఏర్పాటు చేశాం అని , ఈ కంపెనీ రావడం వల్ల 20 వేల ఉద్యోగాలు వచ్చాయి అని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలకు వందల ట్రిప్పుల బస్సులు ఉద్యోగులతో తిరుగుతున్నాయి. అలాగే విశాఖకు కూడా డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వచ్చేవి అని , కానీ ప్రభుత్వ వైఖరి వల్ల అవి వెనక్కి విల్లిపోయాయని తెలిపారు. అలాగే విద్యుత్ పీపీఏలను తిరగదోడాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి అని అన్నారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని, ఎక్కువ ఖర్చు అవుతుందని, సమయం కూడా వృథా అవుతుందని చంద్రబాబు చెప్పారు. ఒకవేల రాజధానులు అంటే మూడు చోట్ల కార్లు, ఇళ్లు, కార్యాలయాలు ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులకు జీతాలు మూడు రెట్లు పెంచాలన్నారు. ఏడాదికి 365 రోజులే ఉందని, జగన్ మాయ చేసి దానిని 700కో 750 రోజులకో పెంచాలంటూ ఎద్దేవా చేసారు.
Tags:    

Similar News