ప‌ద‌వుల పంప‌కం టీడీపీ అధ్య‌క్షుడికే షాకిచ్చింది

Update: 2017-10-04 23:30 GMT
తెలుగుదేశం పార్టీ క‌మిటీల ఏర్పాటులో నెల‌కొన్న అసంతృప్తి ఇంకా భ‌గ్గుమంటోంది. ప‌లు నియోజ‌క‌వర్గాల్లో పార్టీ నాయ‌కులు ద్వితీయ శ్రేణి నేత‌ల‌తో త‌మ‌కు చోటు ద‌క్క‌లేద‌ని, స‌రైన గౌర‌వం లేద‌ని వాపోతున్నారు. త‌మ గాడ్ ఫాద‌ర్ల‌పై గుస్సాతో ఉన్నారు. అయితే ఈ చేదు అనుభ‌వం చోటామోటా లీడ‌ర్ల‌కే కాకుండా ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడికే త‌గిలింది. దీంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న చ‌ప్ప‌గా సాగింది. తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడిగా రెండో ద‌ఫా ఎన్నికైన త‌ర్వాత సొంత‌ జిల్లా పర్యటనకు వచ్చిన కళా వెంకటరావుకు మిశ్ర‌మ స్పంద‌న లభించింది. రాజకీయాల్లో కళా వెంకటరావును గురువుగా భావించే నడుకుదిటి ఈశ్వరరావు ఆయన స్వాగత కార్యక్రమానికి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. న‌మ్మిన బంటుగా ఉన్న త‌న‌కే న్యాయం చేయ‌లేద‌ని, క‌నీసం త‌న శ్ర‌మ‌ను కూడా గుర్తించ‌లేద‌ని స‌ద‌రు నేత స‌న్నిహితుల‌తో ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగాక‌ళా వెంక‌ట్రావు గతంలో ఎన్నిక‌యిన‌పుడు ఆయ‌న ముఖ్య అనుచ‌రుడు అయిన ఈశ్వ‌ర‌రావు సార‌థ్యంలో విశాఖపట్నం నుండి రాజాం వరకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు జరిగాయి. కళా వెంకటరావు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు,తొలిసారిగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, విద్యుత్ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుండి విశాఖపట్నం నుండి రాజాం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీ స్థాయిలో ఈశ్వరరావు బహిరంగ సభలను ఏర్పాటు చేసి కేడర్‌ ను సమాయత్తం చేసేవారు. దీంతో కళా వెంకటరావు కార్యక్రమాలకు జిల్లా కేడర్ రాకపోయినా ఆ ప్రభావం కనబడేది కాదు. కానీ ఈ ద‌ఫా అలాంటి హ‌డావుడి ఏమీ లేదు. దీంతో క‌ళా సైతం ఒకింత చిన్న బుచ్చుకొని రణస్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వెంటనే వెళ్లిపోయారని అంటున్నారు. దీనికంత‌టికీ కార‌ణంగా రాజకీయాల్లో కళా వెంకటరావును గురువుగా భావించే నడుకుదిటి ఈశ్వరరావుకు ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డం.

నియోజ‌క‌వ‌ర్గంలో అండ‌గా ఉండ‌టంతో పాటుగా కళావెంకటరావు గెలుపునకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కీలకమైన ఈశ్వరరావుకు ఆయన సరైన గుర్తింపు ఇవ్వడంలేదని పార్టీ వర్గాల్లోనూ తీవ్ర‌మైన అసంతృప్తి ఉంది. ఇప్పటివరకు రెండుసార్లు రాష్టక్రమిటీ - జిల్లా కమిటీ - శాసన మండలి ఎన్నికల్లో ఈశ్వరరావుకు ఏదో ఒక పదవి వస్తుందని అందరూ భావించారు. ఇదే మాట కళావెంకటరావు కూడా ఈశ్వరరావుకు చెప్పిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. అయితే అధికారం వచ్చిన సుమారు మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆయనకు ఎటువంటి గుర్తింపునివ్వకపోవడంతో స్వాగత కార్యక్రమానికి కినుక వహించినట్లు సమాచారం. అధికారుల నుండి పార్టీ కేడరంతా స్వాగత ఏర్పాట్లలో ఈశ్వరరావు లేకపోవడం చర్చించుకోవడం గమనార్హం. కనీసం ఆయన రాక సందర్భంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో క‌ళా వెంక‌ట్రావు ఊహించింది ఒక‌టైతే....జ‌రిగింది ఇంకొక‌ట‌ని అంటున్నారు.
Tags:    

Similar News