ఏపీ బీపీ : ఒక‌రిది 8 ..మ‌రొక‌రిది 80.. ఏంటీ లెక్క‌లు ?

Update: 2022-06-08 03:29 GMT
అప్పుల గురించి అటు వైసీపీ కానీ ఇటు బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. ఆంధ్రావ‌నిది ఎనిమిది ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పు అని వైసీపీని ఉద్దేశించి బీజేపీ అంటోంది. కాదు దేశం అప్పు 80 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అని బీజేపీని ఉద్దేశించి వైసీపీ అంటోంది. ఈ లెక్క‌లు ఎలా ఉన్నా అప్పులు మాత్రం త‌ప్పేలా లేవు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఇప్ప‌టిదాకా ఉన్న ప‌రిణామాలే తార్కాణం.

వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టిదాకా చేసిన అప్పు, పాత అప్పు అన్నీ కలుపుకుని 8 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అని తేలింది. ఉన్న డ‌బ్బుల‌న్నీ సంక్షేమానికి వెచ్చించి వైసీపీ ప్ర‌భుత్వం దాదాపు బోర్డు తిర‌గేసే దుఃస్థితికి వ‌చ్చింది. ఇది కూడా నిజం !

ఇదే స‌మ‌యంలో డ‌బ్బుల‌న్నీ మేమేం చేస్తున్నాం ప్ర‌జల‌కే కదా పంచుతున్నాం అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే అప్పులు చేసి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం త‌ప్పు అని వైసీపీకి తెలియదా అని ఇదే సంద‌ర్భంలో టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. ప్ర‌జ‌ల‌కు క‌నీస అవ‌స‌రాలు తీర్చే క్ర‌మంలోనే అప్పులు చేస్తున్నాం అన్న‌ది జ‌గ‌న్ వాద‌న. వీటి విష‌య‌మై కేంద్రం బాధ్య‌త అయితే వ‌హించ‌దు. ఎందుకంటే కేంద్రం ష్యూరిటీ ఉంటూ అప్పులు ఇప్పించ‌దు క‌నుక !  కేవ‌లం నిబంధ‌న‌ల మేర‌కు రుణ పరిమితిని మాత్ర‌మే నిర్ణ‌యించి త‌ప్పుకుంటుంది అన్న‌ది వాస్త‌వం.

ఇక కేంద్రం అప్పుల‌కే వద్దాం. ఇప్ప‌టిదాకా 8 ఏళ్ల‌లో 80 ల క్ష‌ల కోట్ల మేర‌కు అప్పులు చేసిన నైజం మోడీది. పోనీ ఇంత అప్పు చేశారు క‌దా ! ఏమ‌యినా వీటిలో సంక్షేమానికి వెచ్చించారా అంటే లేదంటోంది వైసీపీ.  విదేశీ రుణాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా తీసుకుని, వాటిని వేటికి ఖ‌ర్చు చేశారో కూడా చెప్ప‌డం  లేదు.. అని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తోంది.

న‌డ్డా స్పీక్స్ : రాష్ట్రాన్ని తవ్వేస్తున్నారు

ఇష్టా రాజ్యంగా త‌ర‌లిపోతున్న ఇసుక, ప్ర‌జ‌ల‌కు ఇష్టం ఉన్నా లేక‌పోయినా త‌ర‌లిపోతున్న మ‌ట్టి,  కొండ‌లు త‌వ్వి పోతున్న క్వారీ నిర్వ‌హ‌ణ‌..ఇవ‌న్నీ నిన్న‌టి వేళ న‌డ్డా చెప్పిన మాట‌లు.  రెండ్రోజుల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయాధ్య‌క్షుడి మాట‌ల ప్ర‌కారం ఏపీలో ఇసుక మాఫియా ఉంద‌ట. ప‌ర్యావర‌ణ సంబంధ స‌మ‌తుల్య‌త‌తో సంబంధం లేకుండా మ‌ట్టి త‌ర‌లిపోతోందట.  

ఆరోజు విశాఖ నిర్మాణాల పేరిట ఇసుక‌ను త‌రలించినా, లేదా మ‌రో పేరుతో త‌వ్వ‌కాలు సాగించినా అవ‌న్నీ ప‌ర్యావ‌ర‌ణ‌కు విఘాతాలే అని సామాజిక కార్యకర్తల వాదన. ఇప్పుడు తీరం చెంత ఇసుక నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగానే పోతోంది. ముఖ్యంగా జేపీ వెంచ‌ర్స్ తీసుకున్నాక ఇసుక అడ్డూ అదుపూ లేకుండా త‌ర‌లిపోతోంది. వీటికి అడ్డుక‌ట్ట వేయ‌క‌పోవ‌డం ప్ర‌స్తుత ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే ! అని అంటోంది టీడీపీ. వీటినే నిన్న‌టి వేళ మ‌రోసారి ప్ర‌స్తావించారు జేపీ న‌డ్డా! అయితే ఆయ‌న చెప్పిన విధంగా క్షేత్ర స్థాయిలో జ‌ర‌గుతున్న అక్ర‌మాల‌పై విజిలెన్స్ మానిట‌రింగ్ అయితే లేదు. నిఘా కోసం ఉంచాల్సిన సీసీ కెమెరాలు ప‌నిచేయ‌డం లేదు.

మ‌రి ! ఇసుక ర్యాంపుల ద‌గ్గ‌ర అడ్డూ అదుపూ అన్న‌ది ఎలా సాధ్యం. ఇక గోదావ‌రి జిల్లాల‌లోనూ ఇసుక త‌ర‌లింపు అన్న‌ది య‌థేచ్ఛ‌గా సాగిపోతోంది. ఆఖ‌రికి పోల‌వ‌రం నిర్మాణానికి కూడా ఇసుక ఇవ్వ‌డం లేదు సంబంధిత సంస్థ. దీంతో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటే కానీ పోల‌వ‌రం నిర్మాణానికి ఇసుక ద‌క్కలేదు. అదేవిధంగా దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న భూముల్లో అక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌కాశం జిల్లాలో మ‌ట్టి త‌వ్వ‌కాలు విపరీతంగా సాగుతున్నాయి. ఇక్క‌డ ఎర్ర‌మ‌ట్టి ఎక్క‌డ క‌నిపించినా త‌వ్వుకుంటూ పోతున్నార‌న్న వాద‌న ను ఆధారాల‌తో స‌హా నిరూప‌ణ చేస్తోంది ప్ర‌ధాన మీడియా. అయినా కూడా వీటిపై కూడా నిరూప‌ణ లేదు.

మొత్తానికి నడ్డా... జగన్ పై ఉన్న తీవ్రమైన విమర్శలను మరోసారి తెరపైకి తెచ్చి వెళ్లారు. చూడాలి దీనిని ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేస్తాయో?
Tags:    

Similar News