ప్రాంతీయ పార్టీ పెట్టి త‌ప్పు చేశాడ‌ట‌!

Update: 2019-01-29 04:44 GMT
నాదెండ్ల పేరు వినిపించినంత‌నే.. ఉమ్మ‌డి రాష్ట్ర ఆఖ‌రి స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ గుర్తుకు వ‌స్తారు. కానీ.. తెలుగు రాజ‌కీయాల మీద పూర్తి అవ‌గాహ‌న ఉన్న వారికి మాత్రం మ‌నోహ‌ర్ తండ్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు గుర్తుకు రావ‌టం ఖాయం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి.. ఇందిర‌మ్మ ఆశీస్సుల‌తో నెల రోజుల పాటు ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన వైనంపై వినిపించే క‌థ‌నాల‌కు.. ఆయ‌న చెప్పే మాట‌ల‌కు లింకు దొర‌క‌ని ప‌రిస్థితి. ఆ మాట‌కు వ‌స్తే.. సీనియ‌ర్ నాదెండ్ల చెప్పిన‌ట్లు ఎన్టీఆర్ ఆయ‌న్నుమోసం చేసినందుకు రిటార్ట్ ఇచ్చేందుకే తాను రివెంజ్ తీర్చుకున్న మాట వాస్త‌వమే అయినా.. దాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేదు కాబ‌ట్టి.. ఆయ‌న మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పేటోళ్లు ఉన్నారు.

ఏ రాజ‌కీయ పార్టీలో లేని నాదెండ్ల భాస్క‌ర్ రావు తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును త‌ప్పు ప‌డుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  ఏపీ ముఖ్య‌మంత్రి బీసీల‌పై అమిత‌మైన ప్రేమ చూపిస్తున్నార‌ని.. వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నార‌ని.. అంత‌టి ప్రేమ ఉన్న పెద్ద మ‌నిషి దేశ ప్ర‌ధాని మోడీ బీసీ క‌దా?  మ‌రి.. ఆయ‌న్ను ఎందుకు విమ‌ర్శిస్తున్న‌ట్లు? అని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు ఏం చేసినా రాజ‌కీయ జిమ్మిక్కులేన‌ని మండిప‌డిన నాదెండ్ల భాస్క‌ర్ రావు.. ఒక ప్ర‌ధానిని రాష్ట్రానికి రావొద్ద‌ని చెప్ప‌టంలో అర్థం లేద‌న్నారు. కేంద్రం నుంచి సాయం అందాలంటే ఇలాంటి తీరు స‌రికాద‌న్నారు. రాష్ట్రం ఇప్పుడు రూ.2.5ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ఉంద‌ని.. రాష్ట్రంలో రాజ‌కీయ మార్పు రావాల్సిన అవస‌రం ఉంద‌న్నారు.

తాను ఏ పార్టీకి చెంద‌ని వ్య‌క్తిన‌ని.. దేశ ప్ర‌ధాన‌మంత్రిని రాష్ట్రానికి రావొద్దంటూ స్టేట్ మెంట్లు ఇవ్వ‌టం స‌రికాద‌న్నారు.

ఎన్టీఆర్ మీదా.. చంద్ర‌బాబు మీదా తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న చేసి తాను త‌ప్పు చేశానన్నారు. త‌న‌కు మిత్ర‌ద్రోహం చేస్తూ కేబినెట్ నుంచి తొల‌గించినందుకే తాను ఎన్టీఆర్ మీద తిర‌గ‌బ‌డిన‌ట్లు చెప్పారు.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ద‌ర్శ‌కుడు వ‌ర్మ త‌న‌కు తెలీద‌ని.. ఆయ‌న్ను తానిప్ప‌టివ‌ర‌కూ క‌ల‌వ‌లేద‌న్నారు. బ్ర‌తికున్న వ్య‌క్తుల‌ను త‌ప్పుగా చూపించ‌టం స‌రికాద‌న్నారు. ఒక‌వేళ త‌న‌ను త‌ప్పుగా చూపిస్తే.. వ‌ర్మ‌పై చ‌ర్య‌ల విష‌యం త‌న లాయ‌ర్లు చూసుకుంటార‌ని చెప్పారు.
Tags:    

Similar News