అన్ని పశువులు గడ్డి తినవు మంత్రి శ్రీను: నాగబాబు

Update: 2020-05-22 13:00 GMT
మెగా బ్రదర్ నాగబాబు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఇప్పటికే మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పోల్చి పెద్ద వివాదాన్ని నాగబాబు రాజేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఏకంగా మంత్రిని టార్గెట్ చేసి ట్విట్టర్ లో దారుణ వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు వెలువడిన అనంతరం అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి మంత్రి అవంతి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. విషవాయువుల ప్రభావానికి గురైన గ్రామంలోనే నిద్రించారు. గ్రామస్థులకు ధైర్యం నూరిపోశారు. గ్రామంలోనే తిరుగుతూ పశువులకు గడ్డివేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ పశువుకు గడ్డి వేస్తున్న ఫొటోను షేర్ చేసిన నాగబాబు ‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను’ అనే కామెంట్ ను జత చేశారు. దీంతో పదవి కోసం ఇలా మారిపోయావు అని అర్థం వచ్చేలా నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది.

అవంతి శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచే 2009లో అరంగేట్రం చేశారు. భీమిలీ నుంచి పోటీచేసి గెలిచారు. వైఎస్ఆర్ ప్రభంజనాన్ని కూడా తట్టుకున్నారు. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అవంతి కూడా కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. వైఎస్ జగన్ కేబినెట్ లో ఏకంగా మంత్రి అయ్యారు.

తమ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎదిగి ఇప్పుడు మంత్రి అయ్యావ్ అన్న అర్థం వచ్చేలా నాగబాబు తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ పై సెటైర్లు వేశాడు. ప్రజారాజ్యం వల్లే నువ్వు మంత్రివి అయ్యావ్ అని నాగబాబు దెప్పిపొడిచేలా ఆ ట్వీట్ ఉంది. ప్రస్తుతం జనసేనను విమర్శిస్తున్న అవంతిని ఈ ఒక్క ఫొటోతో నాగబాబు టార్గెట్ చేసిన తీరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News