కృష్ణా పుష్కరాలకు అఘోరాలు ఎందుకొచ్చారు?

Update: 2016-08-16 13:45 GMT
అక్కడెక్కడో దూరంగా ఉంటారని.. వారి జీవనశైలి చాలా చిత్ర..విచిత్రంగా ఉంటుందని కథల్లో.. సినిమాల్లో చెప్పే అఘోరాలు తాజాగా ఏపీ పుష్కరాలకు వచ్చేశారు. మధ్యప్రదేశ్ నుంచి తరలివచ్చిన ఈ అఘోరా సాధువులు శంఖం పూరిస్తూ పవిత్రస్నానాలను ఆచరించారు. కృష్ణా పుష్కరాలకు వచ్చిన వారు.. ఏపీని ఎన్నుకోవటం గమనార్హం. కృష్ణా.. గోదావరి నదుల సంగమ ప్రదేశమైన ఫెర్రీ ఘాటల్ కు వచ్చిన అఘోర సాధువులు పుష్కర స్నానం చేశారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నుంచి తరలి వచ్చిన వారు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా అఘోరాలు ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. సినిమాల్లో.. టీవీల్లో అఘోరాల గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని.. తాము శవాల్ని తింటామని ప్రచారం చేస్తుంటారని..కానీ తాము అలాంటివేమీ చేయమని చెప్పిన అఘోరాలు మామూలు ఆహారమే తీసుకుంటామని చెప్పారు. ఆఘోరాల మీద ప్రజల్లో ఉండే అపప్రదల్ని తొలగించేందుకే తాము కృష్ణా పుష్కరాలకు వచ్చినట్లుగా ఒక తెలుగు అఘోరా వెల్లడించారు. సమాజంలో తమ గురించి తప్పుగా అనుకుంటున్నారంటూ అఘోరాలు రావటమే కాదు.. వివరణ ఇవ్వటం కాస్త ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.
Tags:    

Similar News