గాజు గ్లాసులో టీ తాగితే ఆ కిక్కే వేర‌ప్పా!

Update: 2018-12-25 07:20 GMT
నిధుల లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న జ‌న‌సేన పార్టీకి రూ.1.25 కోట్ల భారీ విరాళ‌మిచ్చి త‌మ అభిమానం చాటుకున్నారు నాగ‌బాబు - వ‌రుణ్ తేజ్‌. ఈ తండ్రీ కొడుకుల పెద్ద మ‌న‌సుపై జ‌న‌సేన అధినేత - నాగ‌బాబు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు కూడా. వారి విరాళాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా భావిస్తున్నామ‌ని ప‌వ‌న్ చెప్పారు. వారిద్ద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

తాజాగా బిగ్ బ్ర‌ద‌ర్‌ నాగ‌బాబు జ‌న‌సేన‌కు తాము ఇచ్చిన విరాళంపై స్పందించారు. త‌మ విరాళం విష‌యంపై ట్వీట్ చేసినందుకు ప‌వ‌న్ కు థ్యాంక్స్ చెప్పారు. కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని వ‌దిలి పెట్టి జ‌నంలోకి వెళ్లిన త‌న త‌మ్ముడు ప‌వ‌న్ ప్ర‌జ‌ల సంక్షేమ‌మ‌నే గ్రేట‌ర్ కాజ్ కోసం ప‌గ‌లు - రాత్రి క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని తెలిపారు. ప‌వ‌న్ కు ఏమీ చేయ‌లేక‌పోతున్నాన‌న్న బాధ చాలాకాలంగా త‌మ‌ను వేధిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగి ప‌వ‌న్ కు ఏదైనా చేయాల‌ని భావించినా.. అది త‌మ‌కు కుద‌ర‌డం లేద‌ని నాగ‌బాబు అన్నారు. వ‌రుణ్ తేజ్ చాలా సంద‌ర్భాల్లో ఈ విష‌యంపై త‌న‌తో మాట్లాడాడ‌ని.. బాబాయ్ కి ఏం చేయ‌లేక‌పోతున్నామంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడ‌ని తెలిపారు. సినిమా షూటింగ్ ల కార‌ణంగా వ‌రుణ్ జ‌నంలోకి వెళ్ల‌లేక‌పోతున్నాడ‌ని చెప్పారు. తానూ ఇత‌ర‌త్రా ప‌నుల కార‌ణంగా నేరుగా త‌మ్ముడికి సాయం చేయ‌లేక‌పోతున్నాన‌ని వెల్ల‌డించారు. అందుకే ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా ప‌రోక్షంగానైనా జ‌న‌సేన‌కు, ప‌వ‌న్ కు సాయం చేయాల‌నే ఉద్దేశంతో తాము విరాళం ఇచ్చామ‌ని నాగ‌బాబు తెలిపారు. ఇది చాలా స్వ‌ల్ప మొత్త‌మ‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులోనూ జ‌న‌సేన‌కు మ‌రింత సాయం చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలిపారు.

ప‌నిలో జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు గాజు గ్లాసు గురించీ ప్ర‌చారం చేశారు నాగ‌బాబు. సామాన్యులకు చిహ్నం గాజు గ్లాసు అని ఆయ‌న తెలిపారు. టీ గానీ, కాఫీ గానీ ఈ గ్లాసులో తాగితేనే మ‌జా వ‌స్తుంద‌ని అన్నారు. అందులో తాగితే వ‌చ్చే కిక్కే వేర‌ప్పా అని చెప్పుకొచ్చారు. జై జ‌నసేన అంటూ నిన‌దిస్తూ త‌న త‌మ్ముడిపై అభిమానాన్ని చాటుకున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News