మాజీ మంత్రి - ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈయన బీజేపీ నుంచి రాహుల్ గాంధీ సమక్షంలో తాజాగా కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.. మహబూబ్ నగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్న నాగంకు టీఆర్ ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న 1+1 గన్ మెన్ భద్రతను తొలగించింది. దీంతో ఆయన అధికార టీఆర్ ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని.. వెంటనే భద్రతను కల్పించాలని హైకోర్టును ఆశ్రయించాడు. పిటీషన్ పై గురువారం హైకోర్టు లో విచారణ సాగింది. నాగంకు భద్రతను పునరుద్ధరించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
అంతేకాదు గన్ మెన్ లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కూడా టీఆర్ ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది.
మహబూబ్ నగర్ జిల్లాలో నాగంకు - టీఆర్ ఎస్ నేతలకు భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయని జిల్లాలో ప్రచారం ఉంది. అందుకే ఆయనకు టీఆర్ ఎస్ సర్కారు భద్రతను ఉపసంహరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టు కెళ్లారు. కోర్టు టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో నాగం హర్షం వ్యక్తం చేశారు.