అరే..నాగంకు బీజేపీ ఆఫీస్ గుర్తుందే..!

Update: 2015-08-06 10:08 GMT
ప‌దునైన విమ‌ర్శ‌లు.. సూటిగా విష‌యాన్ని మాట్లాడుతూ.. తాను టార్గెట్ చేసిన నేత‌పై బోలెడ‌న్ని జోకులు.. క‌థ‌లు చెప్పే నాగం జ‌నార్ద‌న‌రెడ్డి రాజ‌కీయంగా కాస్తంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ ఉద్య‌మం పీక్ స్టేజ్ లో ఉన్న స‌మ‌యంలో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి.. ఆ త‌ర్వాత కొంత‌కాలం విడిగా ఉన్న ఆయ‌న‌.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీలో చేర‌టం తెలిసిందే. తెలుగుదేశంలో ఎన్నో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టిన ఆయ‌న‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాలైన త‌ర్వాత నుంచి కాస్తంత కామ్ గా ఉంటున్న ప‌రిస్థితి. బీజేపీలో ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ కార్యాల‌యానికి రావ‌టం.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టం లాంటి వాటికి పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా ఉండే ఆయ‌న మ‌రో చిత్ర‌మైన ప‌ని చేస్తుంటారు.

సాధార‌ణంగా నేత‌లు.. ఏదైనా ప్రెస్‌ మీట్ పెట్టాలంటే పార్టీ ఆఫీసుకెళ్లి మాట్లాడుతుంటారు. కానీ.. నాగం మాత్రం బీజేపీ ఆపీస్ కంటే కూడా.. త‌న సొంతంగా ప్రెస్‌ మీట్ ఏర్పాటు చేసుకుంటారు. స్థానికంగా బీజేపీ నేత‌ల‌తో ఉన్న పంచాయితీతోనే అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తార‌న్న వాద‌న ఉంది. ఇదిలా ఉంటే.. గురువారం ఆయ‌న‌.. హైద‌రాబాద్‌ లోని బీజేపీ ఆపీసుకు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆయ‌న పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చి చాలా కాల‌మే కావ‌టం దీనికి కార‌ణం. ఇన్నాళ్ల‌కు పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన నాగంను చూసిన కొంద‌రు సంతోష‌ప‌డిపోతే.. మ‌రికొంద‌రు మాత్రం అరే.. నాగం సాబ్ కు పార్టీ ఆఫీసు గుర్తుందే అంటూ గొణుక్కోవ‌టం వినిపించింది.
Tags:    

Similar News