నాగార్జున వర్సిటీలో ఏపీ హైకోర్టు!

Update: 2018-01-07 05:28 GMT
హైకోర్టు విభజన ఊపందుకుంది. విభ‌జ‌న నిర్ణ‌యం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి సరిసర ప్రాంతాల్లో భవనాలను అన్వేషిస్తోంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ భవనాలు - లేదా కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రమ సమీపంలో భవనాలను - విజయవాడ సమీపంలోని కంచికచర్లలోని భారీభవనాన్ని గానీ తాత్కాలిక హైకోర్టు కోసం ఏపీ ప్రభుత్వం కమిటీకి ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. తాము గుర్తించిన భవనాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా డిసెంబర్ 27న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ కు లేఖరాశారు. ఈ మేరకు భవనాలను పరిశీలించేందుకు శనివారం ఉమ్మడి హైకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఆచార్య నాగార్జున వర్సిటీలోని భవనాల్లో హైకోర్టు ఏర్పాటుకు సీఎం సముఖంగా ఉన్నట్టు సమాచారం.

గుంటూరు-విజయవాడ ప్రధాన రహదారిపై వర్సిటీ ఉండటంతో పాటు విశాలమైన భవనాలు ఉండటంతో అక్కడ తాత్కాలిక న్యాయస్థానం ఏర్పాటు చేసేందుకు సీఎం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. వర్శిటీకి ఎదురుగా ఉన్న లింగమనేని ఎస్టేట్స్‌ లో సుమారు వంద ప్లాట్స్ ఏపీ సర్కార్ ఆధీనంలో ఉన్నాయి. అందులోని 50 వరకు డూప్లెక్స్ భవనాలను గతంలో ఉన్నతాధికారుల కోసం ఏపీ ప్రభుత్వం లీజ్‌కు తీసుకుంది. ప్రస్తుతం అందులో అధికారులెవరూ నివాసం ఉండకపోవడంతో వాటిని హైకోర్టు న్యాయమూర్తులు - అధికారులు - సిబ్బంది నివాసం కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. మంగళగిరి - తాడేపల్లి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కొన్ని భారీ భవనాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

కాగా, గుంటూరులోని జిల్లా కోర్టు భవనాలను పరిశీలించే అవకాశం ఉన్నా.. ఇక్కడ భవనాల లభ్యత తక్కువగా ఉండటం, నగరం నడిబొడ్డున జిల్లా కోర్టు ఉండడంతో పార్కింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. చుట్టుగుంట సెంటర్‌ లో కార్యాలయాల పరిశీలన గుంటూరులోని చుట్టగుంట సెంటర్‌ లో ప్రస్తుతం ఉన్న ఏపీ వ్యవసాయ - ఉద్యాన - మార్కెటింగ్‌ శాఖ కమిషన్ కార్యాలయాలు ఉన్న భవనాలను తాత్కాలిక హైకోర్టు కోసం పరిశీలించే అవకాశం ఉంది. ఇక్కడ నాలుగుఅంతస్తుల విశాల భవనం - అతిథి గృహం - అదనపు భవనాలు ఉన్నాయి. ఈ భవనాల పరిసరాల్లోని అక్రమ కట్టడాలను ఇటీవల గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు తొలిగించింది. భవనాల కమిటీ - మౌలిక సదుపాయాల కమిటీ సభ్యులు ఈనెల రెండో వారంలో అమరావతి లో పర్యటించి అనువైన భవనాలను పరిశీలించే అవకాశం ఉంది.

ఈ కమిటీ సూచనల మేరకు హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేసి ఏపీ సర్కార్ ఉమ్మడి హైకోర్టుకు - కేంద్ర ప్రభుత్వానికి నివేదించనుంది. ఈ సమాచారాన్ని ఉమ్మడి హైకోర్టు.. భారతప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లనుంది. కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలతో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిఉంటుంది. దీంతో ఏపీలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ ముగుస్తుందని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News