సీఎం కాక ముందే వీరాభిమానిని!!

Update: 2019-05-24 05:38 GMT
కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం `మ‌న్మ‌ధుడు 2` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులో క‌థానాయిక‌. స‌మంత ఓ కీల‌క పాత్ర‌ధారి. పాయ‌ల్ రాజ్ పుత్ వేరొక గెస్ట్ రోల్ చేస్తోంద‌ని స‌మాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం కింగ్ యూనిట్ యూర‌ఫ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆన్ లొకేష‌న్ నుంచి ర‌క‌ర‌కాల స్టిల్స్ ఇప్ప‌టికే అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. సామాజిక మాధ్య‌మాల ద్వారా వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో కింగ్ 20 ప్ల‌స్ కాలేజ్ బోయ్ లా క‌నిపిస్తూ స‌ర్ ప్రైజ్ ఇస్తున్నారు. 60కి చేరువైనా 20లోనే ఆగిపోయారు కింగ్!! అంటూ ఫ్యాన్స్ ఒక‌టే ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 2019 ద‌స‌రా సెల‌వుల్ని అలానే 2020 సంక్రాంతి సెల‌వుల్ని రెండిటిని టార్గెట్ చేసి రెండు రిలీజ్ ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించనున్నారు. మ‌న్మ‌ధుడు 2 ద‌స‌రాకి రిలీజైతే.. బంగార్రాజు సంక్రాంతికి వ‌చ్చేలా కింగ్ ప్లాన్ చేశారు.

ఇక‌పోతే కింగ్ కి రాజ‌కీయాల‌తో ఏ సంబంధం లేదా? అంటే... స‌గ‌టు అభిమానికి చాలా సంగ‌తులు ఆయ‌న గురించి తెలియాలి. టాలీవుడ్ లో ఏ ఇత‌ర హీరోతో పోల్చినా ఓ ఫ‌క్తు బిజినెస్ మ్యాగ్నెట్ గా ఆయ‌న ఆలోచ‌నా శైలి పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆయ‌నకు పొలిటిక‌ల్ గా ఉన్న కాంటాక్ట్స్ మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. ఇటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్- కేటీఆర్ స‌హా అటు ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముగ్గురూ కింగ్ కి స‌న్నిహితులు అని చెబుతారు. ఇటు తెరాస ప్ర‌భుత్వానికి.. అటు వైకాపా ప్ర‌భ‌త్వానికి నాగార్జున ఒక అభిమానిగానే మూవ్ అవుతారు.

నిన్న‌టి మ‌ధ్యాహ్నానికే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి ఎవ‌రో డిక్లేర్ అయిపోవ‌డంతో కింగ్ నాగార్జున అంద‌రి కంటే ముందే జ‌గన్మోహ‌న్ రెడ్డికి శుభాకాంక్ష‌లు చెప్పారు. జ‌గ‌న్ గెల‌వ‌గానే మొద‌ట‌గా విష్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున‌నే. అప్ప‌టికి ఇత‌ర హీరోలెవ‌రూ స్పందించ‌నేలేదు. ``కొత్త యంగ్ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. భూమి కంపించేంత గొప్ప విజ‌య‌మిది`` అంటూ శుభాకాంక్ష‌లు తెలిపారు కింగ్. నాగార్జున త‌ర్వాత‌నే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం త‌న ఓట‌మిని అంగీక‌రిస్తూ కొత్త సీఎం జ‌గ‌న్ కి క్యాజువ‌ల్ విషెస్ తెలియ‌జేశారు. ప‌లువురు హీరోలు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ కి శుభాకాంక్ష‌లు అందించారు. మంచు మోహ‌న్ బాబు శుభాకాంక్ష‌ల‌తో ఆనందం వ్య‌క్తం చేశారు. హీరో సుధీర్ బాబు సైతం సామాజిక మాధ్య‌మాల్లో యంగ్ సీఎం అంటూ శుభాకాంక్ష‌లు అందించారు.

అయితే ఎంద‌రు విష్ చేసినా కింగ్ విషెస్ ప్ర‌త్యేకం. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఇప్ప‌టికిప్పుడు అభిమాని కాదు. వైయ‌స్ జ‌గ‌న్ గెలిచార‌ని ఆయ‌న అభిమానం చూప‌డం లేదు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించ‌క ముందు నుంచి ఆయ‌న అభిమాని. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అన్నా నాగార్జున‌కు అభిమానం. ఆ సంగ‌తిపై మీడియాలోనూ ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగుతుంటుంది. మీడియా ప్ర‌తినిధులు క‌నిపించిన ప్ర‌తిసారీ నాగార్జున త‌ప్ప‌కుండా గుర్తు చేసే పేరు వైయ‌స్ జ‌గ‌న్. వైకాపా స‌న్నివేశం ఎలా ఉంది? అని ఆరాలు తీస్తారు. అందుకే తాజా విక్ట‌రీ నేప‌థ్యంలో కింగ్ విషెస్ ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంద‌ని చెప్పాలి. గెలిచాక అభిమానం కురిపించ‌డం వేరు.. అభిమానం కురిపిస్తూ గెలిచాక అభినందించ‌డం వేరు! ఇందులో రెండో కేట‌గిరీకి చెందుతారు కింగ్.

    
    
    

Tags:    

Similar News