మోడీకి షాక్‌.. సొంత ఎంపీ సున్నా మార్కులేశారు

Update: 2018-04-07 10:04 GMT
ఓప‌క్క విప‌క్షాల విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌ధాని మోడీకి ఊహించ‌ని రీతిలో సొంత పార్టీకి చెందిన ద‌ళిత ఎంపీ ఒక‌రు చేసిన తీవ్ర ఆరోప‌ణ సంచ‌ల‌నంగా మారింది. నాలుగేళ్ల మోడీ పాల‌న‌ను సింఫుల్ గా తేల్చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీకి డ్యామేజింగ్ గా మార‌ట‌మే కాదు.. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బ‌లోపేతం చేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ భారీ క‌ల‌క‌లానికి కార‌ణ‌మైన ఎంపీ ఎవ‌రో కాదు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు చెందిన య‌శ్వంత్ సింగ్‌. నాగిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్ స‌భ‌కు ఎన్నికైన ఆయ‌న‌.. తాను కేవ‌లం రిజ‌ర్వేష‌న్ కార‌ణంగానే ఎంపీని అయ్యాన‌న్నారు.

మోడీ స‌ర్కారు గ‌డిచిన నాలుగేళ్ల కాలంలో ద‌ళితుల‌కు చేసిందేమీ లేద‌ని తేల్చేశారు. వారి ప‌ట్ల తీవ్ర నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. దేశంలోని 30 కోట్ల మంది ద‌ళితుల‌కు కేంద్ర స‌ర్కారు చేసింది శూన్యం అంటూ బాంబు లాంటి మాట‌ను పేల్చారు. ఒక ద‌ళితుడిగా త‌న సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం ఉప‌యోగించుకోవ‌టం లేద‌ని.. తాను కేవ‌లం రిజ‌ర్వేష‌న్ల కార‌ణంగా పార్ల‌మెంటులోకి రాగలిగిన‌ట్లు చెప్పారు.

తాజాగా ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ‌లో ఆయ‌న ప‌లు సంచ‌ల‌న అంశాల్ని ప్ర‌స్తావించారు. ఎస్సీ.. ఎస్టీ వేధింపుల నిరోధ‌క చ‌ట్టంపై సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఇచ్చిన తీర్పును వెన‌క్కి తీసుకోవాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను చేశారు. ఇప్ప‌టికే యూపీకి చెందిన రాబ‌ర్ట్స్ గంజ్ ఎంపీ ఛోటేలాల్ ఖార్వార్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.

త‌న స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌టానికి యూపీ ముఖ్య‌మంత్రి అదిత్య‌నాథ్ వ‌ద్ద‌కు వెళితే.. త‌న స‌మ‌స్య‌ల్ని చెప్పుకోనివ్వ‌కుండా బ‌ల‌వంతంగా గెంటేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ద‌ళిత ఎంపీ అయిన ఛోటేలాల్ వ్య‌వ‌హారం బీజేపీ అధినాయ‌క‌త్వానికి ఇబ్బందిగా మారిన వేళ‌.. అందుకు తోడుగా తాజాగా య‌శ్వంగ్ సింగ్ ఆరోప‌ణ‌లు పార్టీకి న‌ష్టం చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News