ర‌జ‌నీకాంత్ తో ఆమె భేటీ మ‌ర్మ‌మేంది?

Update: 2017-05-07 09:18 GMT
త‌మిళ‌సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తో ప‌లువురు ప్ర‌ముఖులు త‌ర‌చూ భేటీ అవుతుంటారు. అయితే.. కొంద‌రు రాజ‌కీయ ప్ర‌ముఖులు భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. చ‌ర్చ‌నీయాంశంగా మారే పరిస్థితి. త‌మిళ రాజ‌కీయాల్లోకి ర‌జ‌నీని లాగేందుకు గ‌డిచిన కొన్నేళ్లుగా ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌టం తెలిసిందే. అయితే.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ ఏదో ఒక‌టి చెప్పి త‌ప్పించుకున్న ఆయ‌న‌.. పాలిటిక్స్ లోకి వ‌స్తారా? రారా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. త‌న‌కు రాజ‌కీయాలంటే పెద్ద‌గా ఆస‌క్తి లేన‌ట్లుగా చెప్పిన‌ప్ప‌టికీ.. త‌న సినిమాల్లో న‌ర్మ‌గ‌ర్భ‌మైన డైలాగ్స్ తో త‌న మ‌న‌సులోని కోరిక‌ను చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా ఆలిండియా మ‌హిళా కాంగ్రెస్ కార్య‌ద‌ర్శి.. సినీ న‌టి న‌గ్మా తాజాగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ ను క‌ల‌వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌ప్పుడు ర‌జ‌నీతో క‌లిసి సూప‌ర్ హిట్ భాషాలో న‌టించింది. రాజ‌కీయాల్లో ర‌జ‌నీ ఎంట్రీపై ప‌లు వ్యాఖ్య‌లు వినిపిస్తున్న వేళ‌.. తాజా భేటీ ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ స‌మావేశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన న‌గ్మా.. ఇది జ‌రిగిన త‌ర్వాతి రోజే ర‌జ‌నీకాంత్ ను క‌ల‌వ‌టం వెనుక ఏదైనా కార‌ణం ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. వీరి భేటీ ఏ అంశాల‌కు సంబంధించింద‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. ర‌జ‌నీని క‌లిసిన సంద‌ర్భంగా శాలువా.. పూల‌బొకేతో ఆయ‌న్ను స‌త్క‌రించారు. వీరి భేటీ మ‌ర్యాద‌పూర్వ‌క‌మైన‌దే త‌ప్పించి.. ఎలాంటి రాజ‌కీయాంశాలు లేవ‌ని చెబుతున్నా.. ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News